Hyderabad: అజ్ఞాతంలో కరాటే కల్యాణి.. ఆమె పాత హిస్టరీని తోడుతున్న పోలీసులు

|

May 16, 2022 | 1:28 PM

వరుస వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నారు సినీ నటి కరాటే కల్యాణి. మొన్న యూట్యూబర్‌తో గొడవతో రచ్చకెక్కగా, తాజాగా, ఆమె ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. మరి ఈ సోదాలకు కారణమేంటి..?

Hyderabad:  అజ్ఞాతంలో కరాటే కల్యాణి.. ఆమె పాత హిస్టరీని తోడుతున్న పోలీసులు
Karate Kalyani
Follow us on

Karate Kalyani: కరాటే కల్యాణి పలువురు చిన్నారులను కిడ్నాప్‌ చేయడంతో పాటు 2నెలల పిల్లలను కొనుగోలు చేసినట్లుగా ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. నెలల వయస్సున్న పిల్లలను అడ్డుపెట్టుకుని డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఆమె సంబంధీకులు పిల్లలను దత్తత తీసుకున్నట్లు చెబుతున్నారు. అందుకు సంబంధించి పత్రాలు కల్యాణి దగ్గర ఉన్నాయా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా, సినీనటి కరాటే కల్యాణిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టారు అధికారులు. హైదరాబాద్‌లోని కల్యాణి నివాసంలో ఆమె తల్లి విజయలక్ష్మి, సోదరుడిని చైల్డ్‌ లైన్‌ ప్రొటెక్షన్‌ స్కీం అధికారులు ప్రశ్నించారు. కరాటే కల్యాణి అక్రమంగా ఓ పాపను దత్తత తీసుకున్నారంటూ, 1098 నంబర్‌కు ఫిర్యాదు వచ్చిందని, అందుకే పోలీసుల సహకారంతో వారిని విచారించినట్టు వెల్లడించారు అధికారులు. హైదరాబాద్‌ నగరంలోని ఓ దంపతులకు మూడోసారి ఆడ శిశువు జన్మించిందని, వారికి తెలిసిన వ్యక్తుల ద్వారా ఆ పాపను కల్యాణి తెచ్చుకుని పెంచుకుంటోందని అధికారులతో చెప్పారు ఆమె తల్లి విజయలక్ష్మి. పాపను న్యాయబద్ధంగానే దత్తత తీసుకుందన్నట్టు చెప్పారు. తమ కూతురు ఎలాంటి తప్పు చేయలేదని, ఆమెకు సామాజిక సేవ అంటే ఇష్టమని, అందుకే అనాధలను, తల్లిదండ్రులు లేని పిల్లలను ఆదరిస్తుందని చెబుతున్నారు. అయితే, అధికారుల విచారణ జరుగుతున్న సమయంలో కరాటే కల్యాణి, పాప ఇంట్లో లేరు. దీంతో అనుమానాలు వ్యక్తం చేశారు అధికారులు. కల్యాణి ఇంట్లో ఉన్నవారికి నోటీసులు ఇచ్చారు. తమ ముందు విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు చైల్డ్‌ లైన్‌ ప్రొటెక్షన్‌ స్కీం అధికారులు. అయితే దీనిపై కల్యాణి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఆమె ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. దత్తత తీసుకుందా? డబ్బులకు కొనుక్కుందా? నిబంధనలకు విరుద్ధంగా దత్తత తీసుకుందా?ఇద్దరేనా ? ఇంకెవరినైనా తీసుకొచ్చిందా..?  ఆ పిల్లల తల్లిదండ్రులు ఎవరు? ఎక్కడ?..  11ఏళ్ల పాటు పెంచుకున్న బాబు ఎవరు? అన్న విషయాలపై  పోలీసులు ఫోకస్ పెట్టారు. అయితే ఇల్లీగల్‌ దత్తతను తీవ్ర నేరంగా చెబుతున్నారు పోలీసులు. కల్యాణి స్పందిస్తేనే ఈ అంశాలపై పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవాశం ఉంది.