హైదరాబాద్, జనవరి 16: రెండు తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి పండుగ వాతావరణంలో మునిగిపోతే హైదరాబాద్ నగర శివార్లు మాత్రం వరుస విషాదాలతో విలవిలలాడుతున్నాయి. సరిగ్గా పండుగ రోజు చోటు చేసుకున్న మూడు వేరువేరు ఘటనలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎక్కడా ఎలాంటి క్లూ లభించలేదు. ఈ మరణాల వెనుక దాగి ఉన్న మిస్టరీని చెదిరించే పనిలో ఉన్నారు పోలీసులు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలు ఒకసారిగా ఉలిక్కిపడ్డాయి. సరిగ్గా సంక్రాంతి పండుగ రోజు వికారాబాద్ శివారులో ఒక మహిళను దుండగులు దారుణంగా హత్య చేసారు. అయితే మహిళను అత్యాచారం చేసే హత్య చేశారా? లేదా ఎక్కడో చంపి ఇక్కడ పడేసారా? అనే వివరాలు ఇప్పటికీ తెలియదు. హత్య చేసిన అనంతరం మహిళ ఆనవాళ్లు గుర్తుపట్టకుండా ఉండేందుకు దుండగులు పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టారు. ఘటన స్థలంలో లభించిన ఆధారాలను సేకరించిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఇక కొద్ది రోజుల క్రితం మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైతం ఇలాంటి ఘటన ను పోలీసులు చవిచూశారు. మూడు రోజుల వరకు కనీసం ఒక్క క్లూ కూడా లభించని కేసులో చివరికి అది ఒక ఆత్మహత్యగా పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ రెండు ఘటనలో అమ్మాయిలపై పెట్రోల్ పోసి ఉండటం విశేషం. మొయినాబాద్ కేసును పక్కా ఆత్మహత్యగా పోలీసులు తెల్చేశారు. ఇప్పుడు వికారాబాద్ ఘటనలోను అనుమానాస్పద యువతి మృతిపై పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వికారాబాద్ పరిసర పోలీస్ స్టేషన్లో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. రెండు రోజుల క్రితం నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలను అక్కడ లభించిన యువతి మృతి దేహంతో పోల్చి చూస్తున్నారు. ఇప్పటివరకు పోలీసులకు ఈ కేసులో ఎలాంటి క్లూ లభించలేదు. పరిసరాలలో లభించిన సీసీటీవీ కేమెరా ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రెండు రోజులుగా ఎవరైనా యువతి ఇంటికి చేరుకోలేదనే ఫిర్యాదు ఉంటే వెంటనే తమను ఆశ్రయించాలని వికారాబాద్ పోలీసులు చెబుతున్నారు.
ఇక మరో ఘటన సరిగా పండుగ రోజు చోటు చేసుకుంది. అదిగొట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అనుమానాస్పద మృతదేహం కలకలం రేపుతుంది. బ్రాహ్మణపల్లి ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఒక గోన సంచి నుండి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గోనె సంచిని తెరిచి చూశౄరు. అందులో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న ఒక పురుషుడి మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన ఆదిభట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే నగర శివారు ప్రాంతం కావడంతోనే ఎక్కడో చంపేసి గోనె సంచిలో మృతదేహాన్ని పెట్టి ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డుపై నుంచి కిందికి పడేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన పలు మిస్సింగ్ కేసుల వివరాలను పోలీసులు వెరిఫై చేస్తున్నారు. దీంతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు పైన ఉన్న సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు.
ఇక మరో ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సూరారం వద్ద ఉన్న జ్యోతి డైరీ పాల కంపెనీ వద్ద ఒక యువకుడి మృతదేహం అనుమానాస్పద స్థితిలో పడి ఉంది. యువకుడి తలకు బలమైన గాయం కావడంతో యువకుడు ఎవరనే విషయం ఇప్పటివరకు పోలీసులు గుర్తించలేదు. సూరారం బహదూర్ పల్లి రహదారి పక్కన మృతదేహం పడి ఉండటంతో రోడ్డు ప్రమాదంలో మరణించాడా? అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు కేవలం తలకు మినహాయిస్తే యువకుడు శరీరంపై ఎలాంటి గాయాలు లేదు. దీంతో కచ్చితంగా యువకుడు హత్యకు గురై ఉంటాడని పోలీసులు బలంగా నమ్ముతున్నారు. అది కూడా వేరే చోట హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రహదారి కావటంతో పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను సైతం పోలీసులు వెరిఫై చేస్తున్నారు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.