తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రతి పార్టీ తమ గుర్తును ఓటర్లకు చూపించుకుంటూ ప్రచారంలో వేగం పెంచాయి. ఈ సారి గెలుపు తమదంటే తమదంటూ ఎలక్షన్ల బరిలో అభ్యర్థులు రకరకాల హామీలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సారి జనసేన పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమైంది. బీజేపీతో పొత్తులో భాగంగా కూకట్‌పల్లి నుంచి జనసేన తరఫున ప్రేమ్ కుమార్ బరిలో దిగనున్నారు. అయితే ఇదే స్థానంలో జాతీయ జనసేన పార్టీ తరఫున మరో అభ్యర్థి బరిలో దిగనుండటంతో జనసేనకు పెద్ద సమస్యగా మరింది. పార్టీ పేర్లు ఇంచుమించు ఒకేలా ఉండటంతో ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందంటుంన్నారు. పైగా జనసేన గుర్తు గాజు గ్లాసు కాగా జాతీయ జనసేన పార్టీ గుర్తుగా బకెట్‌ను కేటాయించింది ఎన్నికల సంఘం. దీంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందంటున్నారు ఆ పార్టీ శ్రేణులు. కమ్మ సామాజిక వర్గ ఓటర్లతో పాటూ ఆంధ్ర సెటిలర్లు అధికంగా ఉన్న ప్రాంతం కావడంతో జనసేన గెలుపు ఖాయం అని భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో పార్టీ గుర్తు వ్యవహారం జనసేనకు కొత్త తలనొప్పిని తెచ్చి పెడుతోంది. ప్రేమ్ కుమార్ ఇప్పటికే తన సొంత డబ్బులతో అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేశారని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.
గతంలో జనసేన 32 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని భావించారు. దీనిపై అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన అభ్యర్థుల సమావేశం కూడా జరిగింది. అయితే బీజేపీ తమతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరింది. దీనిపై సుదీర్ఘ కాలం చర్చల తరువాత పొత్తు అంశం ఒక కొలిక్కి వచ్చింది. కేంద్ర మంత్రి అమిత్‌షాతో పవన్ కళ్యాణ్‌తో పాటూ కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఆ తరువాత జరిగిన చర్చల్లో జనసేనకు తొలుత 11 స్థానాలు ఇవ్వాలని భావించినప్పటికీ చివరకు ఎనిమిది స్థానాలు కేటాయించారు. మన్న ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరై ప్రసంగించారు. అయితే తాజాగా గుర్తుపై నెలకొన్న సమస్య పోలింగ్‌పై ఎంత ప్రభావం చూపుతుందో తెలియాలంటే ఫలితాల వరకూ వేచి ఉండక తప్పదు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..