Supreme Court: విద్యుత్ ఉద్యోగుల విషయంలో తెలంగాణకు సుప్రీంకోర్టులో షాక్.. ఇడే చివరి అవకాశమని వార్నింగ్..

|

Oct 12, 2022 | 6:32 AM

విద్యుత్‌ ఉద్యోగుల విషయంలో సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీవ్ అయిన 84 మందికి పోస్టింగ్ లు ఇవ్వకపోవడంపై ప్రభుత్వానికి దేశ అత్యున్నత న్యాయస్థానం వార్నింగ్ ఇచ్చింది...

Supreme Court: విద్యుత్ ఉద్యోగుల విషయంలో తెలంగాణకు సుప్రీంకోర్టులో షాక్.. ఇడే చివరి అవకాశమని వార్నింగ్..
Supreme Court of India
Follow us on

విద్యుత్‌ ఉద్యోగుల విషయంలో సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీవ్ అయిన 84 మందికి పోస్టింగ్ లు ఇవ్వకపోవడంపై ప్రభుత్వానికి దేశ అత్యున్నత న్యాయస్థానం వార్నింగ్ ఇచ్చింది. విద్యుత్‌ ఉద్యోగుల విభజన విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను వ్యతిరేకించడంపై ప్రభుత్వంపై మండిపడింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించిన విద్యుత్‌ శాఖ అధికారులకు జైలు శిక్షే పరిష్కారమని వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలు ఉద్దేశ పూర్వకంగానే ఉల్లంఘించారని ధర్మాసనం ఆక్షేపించింది. ఏపీ నుంచి వచ్చిన వారికి పోస్టింగ్‌ ఇచ్చేందుకు ఇదే చివరి అవకాశమని, రెండు వారాల్లో జస్టిస్ ధర్మాధికారి నివేదికను అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు ధిక్కారం కింద విద్యుత్ శాఖ అధికారులకు జైలు శిక్షే పరిష్కారం అని జస్టీస్ ఎం.ఆర్. షా, కృష్ణ మురారిల ధర్మాసనం స్పష్టం చేసింది. ఆంధ్రా నుంచి వచ్చిన విద్యుత్ శాఖ అధికారులకు నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడంపై న్యాయమూర్తులు తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు.

జస్టిస్ ధర్మాధికారి ఏక సభ్య కమిటీ నివేదిక పైనల్ అని అనేకసార్లు సుప్రీం స్పష్టం చేసినా తెలంగాణ ప్రభుత్వం కావాలనే అమలు చేయడం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. జస్టిస్ ధర్మాధికారి నివేదికను అమలు చేయకపోవడం కోర్టు ధిక్కారమేనని చెప్పింది సుప్రీం కోర్టు. సుప్రీం ఆదేశాల అమలుకు తెలంగాణకు చివరి అవకాశం ఇచ్చింది. రెండు వారాల్లో జస్టిస్ ధర్మాధికారి నివేదికను అమలు చేయాలని ఆదేశించింది. ఏపీ విద్యుత్ సంస్థల నుంచి రిలీవ్ అయిన 84 మందికి వెంటనే నియామక ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను 31కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత విద్యుత్ ఉద్యోగుల విభ‌జ‌న‌కు సంబంధించి రెండు రాష్ట్రాల మ‌ధ్య వివాదం నెల‌కొంది. ఈ వివాదాన్ని ప‌రిష్కరించ‌కుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని వాపోతూ విద్యుత్ ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిష‌న్‌పై ఇప్పటికే విచార‌ణ‌ను పూర్తి చేసిన సుప్రీంకోర్టు ఉద్యోగుల విభ‌జ‌న‌కు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేర‌కు తెలంగాణ నుంచి రిలీవ్ అయిన ఉద్యోగుల‌కు ఆంధ్రప్రదేశ్ లో పోస్టింగ్‌లు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీవ్ అయిన వారిలో కొంద‌రికి పోస్టులు ఇచ్చిన తెలంగాణ ఇంకో 84 మందికి ఇంకా పోస్టింగ్‌లు ఇవ్వలేదు.