Hyderabad Rains: తెలంగాణలోని రాజధాని హైదరాబాద్ సహా పలు జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. గత రెండు రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి.. తీరం దాటింది. దీని ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని తెలిపింది. అందుకనే రాగల 48 గంటల్లో హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తాయని.. రాష్ట్రంలోని పలు జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అంతేకాదు ఖమ్మం, నారాయణపేట, నగర్ కర్నూలు, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నల్గొండ, భువనగిరి, సూర్యాపేట, హైదరాబాద్ జిల్లాకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్ లో తెల్లవారు జామునుంచి చిన్న చిన్న చినుకులు పడ్డాయి. నల్లని మబ్బులతో చీకట్లు కమ్ముకున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగానే నగరంలో పలు ప్రాంతాల్లో మోస్తరుగా వర్షం కురిసింది. ఇప్పటికే GHMC అధికారులు కిందిస్థాయి సిబ్బందిని అలర్ట్ చేశారు. అయితే శుక్రవారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తేలికపాటి వర్షం కురిసింది. జగద్గిరిగుట్టలో అత్యధికంగా 4.5 మి.మీలు వర్షపాతం నమోదైంది. అటు నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో వరిపంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట కోతకు వచ్చే సమయంలో అకాల వర్షాలు కురవడంతో పంటకు భారీ నష్టం జరిగింది. అన్నదాత కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు
Also Read: సీనియర్ నటుడు కైకాల ఆరోగ్య పరిస్థితి విషమం.. జూబ్లీ హిల్స్‌లోని అపోలో చికిత్స