
దేశంలో సంతాన లేమితో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. అందుకు తగ్గట్టుగానే వీధికో సంతాన పాఫల్య కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. అయితే వాటిల్లో చికిత్స అన్ని వర్గాలవారికి అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటి వారికి ఇక చింత అక్కర్లేదు. సంతానం లేని దంపతులకు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా…ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రవేశపెట్టిన సంతాన సౌఫల్య కేంద్రం మంచి ఫలితాలనిస్తోంది. ఐవిఎఫ్ సెంటర్ ద్వారా పేట్ల బురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ముగ్గురు మహిళలకు విజయవంతమైనట్లు ఆస్పత్రి సూపరింటిండెంట్ డాక్టర్ రజిని రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం రోజు ఆమె విలేకరుల సమావేశంలో వివరించారు.
ఆస్పత్రిలోని సంతాన సౌఫల్య కేంద్రం ఐవిఎఫ్ సెంటర్‌కు 20 మంది పేర్లు నమోదు చేసుకోగా అందులో శంషాబాద్, నారాయణఖేడ్, హైదరాబాద్లోని పాతబస్తీకి చెందిన ముగ్గురు మహిళలకు మూడు నెలల చికిత్స అనంతరం విజయవంతమైనట్లు ఆమె వివరించారు. సంతానం లేని దంపతులు ప్రైవేట్ ఆస్పత్రులను కాకుండా ప్రభుత్వాసుపత్రిలో సంతాన సౌఫల్య కేంద్రం ఐవిఎఫ్ సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ విజయం వెనుక ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది కృషి ఎంతో ఉందని ఆమె అన్నారు. ఈ సమావేశంలో ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ అమృతలక్ష్మి, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ తరహా సౌకర్యాలను అందించటం ప్రజల ఆదరణకు తోడ్పడుతుందని సాంకేతికత, నిపుణుల శ్రద్ధతో ఇలాంటి విజయం సాధించగలగడం చాలా గర్వంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వెళ్లి లక్షల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టుకుని చివరికి ప్రభుత్వ హాస్పిటల్‌కి వస్తున్నారని వైద్యులు తెలిపారు. ఇలాంటి అవకాశాన్ని సమస్య ఉన్న ప్రతి దంపతులు వినియోగించుకోవాలని సూచించారు. సంతానం కోసం ఎన్నో హాస్పిటళ్లకు తిరిగి ఆర్థికంగా నష్టపోయామని ఇక్కడికి వచ్చాక తమ ప్రయత్నం ఫలించిందని దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..