Hyderabad: ఆధార్ కార్డు కాదు.. ఇకపై ఇది ఉంటేనే మహిళలకు ఫ్రీ బస్సు..! పూర్తి వివరాలు

ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కోసం మహిళలకు 'మహాలక్ష్మీ' స్మార్ట్ కార్డులు త్వరలో జారీ కానున్నాయి. దీనికి పౌర సరఫరాల శాఖ డేటాను ప్రామాణికంగా తీసుకుని తొలి దశలో తెల్ల రేషన్ కార్డులున్న 5 లక్షల మందికి ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఆ వివరాలు ఇలా..

Hyderabad: ఆధార్ కార్డు కాదు.. ఇకపై ఇది ఉంటేనే మహిళలకు ఫ్రీ బస్సు..! పూర్తి వివరాలు
Free Bus

Edited By:

Updated on: Feb 21, 2026 | 9:40 AM

మహాలక్ష్మీ పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్న మహిళల కోసం ఆర్టీసీ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. అర్హులకే ప్రయోజనం అందేలా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ కార్డులు జారీ చేయాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఫేక్ ఆధార్ కార్డులతో ప్రయాణాలు, ఇతర రాష్ట్రాల మహిళల వినియోగాన్ని అడ్డుకునేందుకే ఈ చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకానికి నగరంలో విశేష స్పందన లభిస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో సుమారు 3,200 బస్సులు నడుస్తుండగా, అందులో దాదాపు 2 వేల ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ఉన్నాయి. రోజుకు సుమారు 5 లక్షల మంది ప్రయాణికుల్లో దాదాపు 2 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఆక్యుపెన్సీ రేషియో కూడా 90 శాతానికి చేరింది.

అయితే, ఇటీవల ఫేక్ ఆధార్ కార్డులతో ప్రయాణాలు జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. సుమారు 25 నుంచి 30 వేల వరకు అనుమానాస్పద ప్రయాణాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం పెరుగుతున్న నేపథ్యంలో స్మార్ట్ కార్డు విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. స్మార్ట్ కార్డులను చిప్ ఆధారిత టెక్నాలజీతో రూపొందించనున్నారు. కార్డులో లబ్ధిదారుల పేరు, చిరునామా, ప్రత్యేక ఐడీ నంబర్ వంటి వివరాలు నమోదు చేస్తారు. ప్రస్తుతం ఆధార్ కార్డు చూపిస్తే టికెట్ జారీ చేస్తున్న కండక్టర్లు, కొత్త విధానంలో స్మార్ట్ కార్డును టికెట్ ఇష్యూయింగ్ మెషీన్‌తో స్వైప్ చేస్తారు. వెంటనే టికెట్ జనరేట్ అవుతుంది. దీంతో ప్రయాణ ధృవీకరణ మరింత పారదర్శకంగా ఉంటుంది. ఆధార్ కార్డులను ప్రతిసారి వెంట తీసుకెళ్లాల్సిన ఇబ్బంది తగ్గడంతో పాటు, అర్హులైన మహిళలకు సౌకర్యవంతమైన విధానం అమల్లోకి రానుంది. స్మార్ట్ కార్డు జారీ విధానం, రిజిస్ట్రేషన్ ప్రక్రియపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. మహాలక్ష్మి పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేసేందుకు ఈ చర్యలు కీలకంగా మారనున్నాయి.

Follow Us