ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఆపరేషన్లు చేసిన డాక్టర్ జోయల్ సునీల్ కుమార్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. అంతే కాకుండా. రంగారెడ్డి DMHO స్వరాజ్య లక్ష్మి, DCHS ఝాన్సీ లక్ష్మిపై బదిలీ వేటు పడింది. వీరితో పాటు మొత్తం 13 మందిపై క్రమశిక్షణ చర్యలకు వైద్యారోగ్య శాఖ ఆదేశించింది.
బాధ్యులపై చర్యలతో పాటు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా మార్గదర్శకాలు జారీ చేసింది ప్రభుత్వం. ఆపరేషన్ తర్వాత పేషెంట్‌ను 24 గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచాలి. ఇంటకి వెళ్లిన తర్వాత పేషెంట్ పరిస్థితి తెలుసుకోవాలని సూచించింది. ఒక ఆస్పత్రిలో రోజుకు 30కంటే ఎక్కువ ఆపరేషన్లు చేయడానికి వీల్లేదు. అలాగే ప్రతి సోమవారం ఇన్ఫెక్షన్ నివారణపై సమీక్ష జరపాలని ఆదేశించింది వైద్యారోగ్య శాఖ.
ఆగస్ట్ 25న ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిలో నలుగురు మహిళలకు కుటుంబ నియత్రణ నియంత్రణ ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆపరేషన్ వికటించి.. మమత, సుష్మ, మౌనిక, లావణ్య ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రాన్ని కుదిపేసింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ.. మృతుల బంధువులు, ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.
ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. విచారణకు ఆదేశిస్తూ ఎక్స్‌పర్ట్ కమిటీని నియమించింది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే మహిళలకు ఇన్ఫెక్షన్ సోకినట్టు గుర్తించింది. సర్జరీ టైమ్‌లో వాడే పరికరాలన్నీ పూర్తిగా స్టెరిలైజ్ చేసి ఉండాలనే ప్రాథమిక విషయాన్ని ఎలా మర్చిపోయారు.. అంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉన్నారంటూ ప్రశ్నించింది విచారణ కమిటీ.
సాధారణంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న వారికి మరో వారం పది రోజులపాటు వైద్య సేవలు అవసరం. స్థానికంగా ఉండే ANMలు, ఆరోగ్య కార్యకర్తలు వారి ఇళ్లకు వెళ్లి సర్జరీ జరిగిన చోట డ్రస్సింగ్ చేయాలి. కానీ ఇక్కడలా జరగలేదని తెలుస్తోంది. ఆపరేషన్ చేసిన చోట చీము పట్టడం మరికొందరిలో ఇన్ఫెక్షన్‌కి కారణమైంది. వీటన్నిటిపైనా విచారించిన దర్యాప్తు కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా 13 మందిపై యాక్షన్ తీసుకుంది ప్రభుత్వం.
మరిన్ని హైదరాబాద్ వార్తలు కోసం..