Telangana Elections: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ మార్గాల్లో రాజకీయ పార్టీలు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ఎక్కడికి ఎక్కడ పోలీసులు తనిఖీలు ఉంటుండడంతో డబ్బు మద్యం పంపిణీ కష్టమవుతుంది.. రూటు మార్చిన రాజకీయ పార్టీలు ఈసారి మహిళలను టార్గెట్ గా చేసుకున్నాయి. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరలను పంపిణీ చేసేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు.. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఈసారి బతుకమ్మ చీరలు పంపిణీకి సైతం బ్రేక్ పడింది. దీంతో ఎలాగైనా సరే మహిళలకు చీరలను చేర్చాలనుకున్న నేతలు దొంగ చాటుగా పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. వరంగల్ నుంచి హైదరాబాద్ కు ఒక లారీని మాట్లాడిన నేతలు.. చీరల స్టాక్ అంతా లారీలో సెట్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ కు గుట్టుచప్పుడు కాకుండా తరలించారు. ఈ క్రమంలో సరిగ్గా హైదరాబాద్ లోకి లారీ ఎంటర్ కాగానే బాచుపల్లి వద్ద పోలీసులు అడ్డగించారు.
వివరాలు అడగగా.. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రగతి నగర్ కు లారీ వెళుతోందని డ్రైవర్ సమాచారం ఇచ్చాడు. లారీ ఫుల్ లోడుతో వెళ్తుండడంతో అనుమానం వచ్చిన పోలీసులు.. వెంటనే లారీని చెక్ పోస్ట్ వద్ద ఆపేసి తనిఖీలు చేశారు. ఈ క్రమంలో లారీ నిండా చీరలే కనిపించాయి. అయితే, ఆ చీరల లోడ్ ప్రగతి నగర్లో ఉన్న పంచవటి అపార్ట్మెంట్ కు వెళుతున్నట్టు పోలీసులు నిర్ధారించారు.
వెంటనే లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు. వరంగల్ నుండి తీసుకువచ్చిన చీరల విలువ సుమారు కోటి రూపాయలకు పైగానే ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. లారీతోపాటు చీరలను బాచుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే, దీని వెనక ఉన్న నాయకుల పేర్లు మాత్రం తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..