హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో మోమెస్‌ను తిన్న సింగాడకుంట బస్తీకి చెందిన రేష్మ బేగం మృతి చెందారు. బస్తీలోని సుమారు 50 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఇక కొద్ది రోజుల క్రితం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుకుంటలో ఉన్న గ్రిల్ హౌస్‌లో షవర్మా తిన్న 20 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. వీటన్నింటికి ఫుడ్ పాయిజనే కారణం. అయితే షవర్మా లేదా మోమోస్ వల్ల వాళ్లకు ఫుడ్ పాయిజన్ కాలేదంటున్నారు ఆహార నిపుణులు. వాటిలో వాడే చట్నీ, మయోనైజ్ ఈ ప్రమాదాలకు కారణమంటున్నారు. మయోనైజ్‌ను.. కబాబ్‌లు, పిజ్జాలు, బర్గర్లు, మండి బిర్యానీ, శాండ్‌విచ్‌లు, ఇతరత్రా ఫుడ్స్‌లో చెట్నీలా నంజుకు తింటారు.
అసలు ఏంటి ఈ మయోనైజ్ ? అది ఎందుకంత డేంజర్‌గా మారుతోంది. దాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. గుడ్డులోని పచ్చసొన, 2 టేబుల్ స్పూన్లు వెనిగర్, లేదా నిమ్మరసం.. 1 టేబుల్ స్పూన్ డిజోన్ ఆవాలు, 1/2 టీస్పూన్ ఉప్పు, 1/2 టీస్పూన్ తెల్ల మిరియాలు, 2 కప్పుల వంట నూనె, ఉప్పు… వీటన్నింటిని బ్లెండ్ చేసి మిక్సీలో వేసి దీన్ని తయారు చేస్తారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది రా ఫుడ్. అంటే ఎక్కువసేపు నిల్వ ఉండదు.
ఎగ్ మయోనైజ్‌లో కంటామినేషన్ ఎక్కువగా ఉంటోందంటున్నారు GHMC ఫుడ్ సేఫ్టీ అధికారులు. అది రా ఫుడ్ కావడంతో నిల్వ ఉండదని, దానివల్లే ఫుడ్ పాయిజన్ జరుగుతోందంటున్నారు. GHMCలో వ్యవస్థలో లోపాలను సరిచేయకోతే ఇలాంటి అనర్థాలను అరికట్టలేమంటున్నారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు చెందిన పద్మనాభ రెడ్డి.
అసలు ఎందుకింత డేంజర్‌గా మారుతోంది ఈ మయోనైజ్
ఎగ్స్, వెనిగార్, నూనెతో తయారీ చేసే మయోనైజ్.. నిల్వ చేస్తే అందులో బ్యాక్టీరియా చేరుతుంది. అది తింటే ఫుడ్ పాయిజన్‌కు దారి తీస్తుంది. వికారం, వాంతులు, విరేచనాలు అవుతాయి. మరింత విషతుల్యంగా మారితే ప్రాణాలు పోయే చాన్స్ ఉంది. తయారు చేసి 3 గంటలు దాటితే మయోనైజ్ ప్రమాదకరంగా మారుతుంది అంటున్నారు నిపుణులు. దీని ప్రమదాన్నే గుర్తించిన.. ఆహార కల్తీ నియంత్రణ విభాగం.. మయోనైజ్‌ను నిషేధించాలని ప్రభుత్వానికి లేఖ రాసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..