
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండలు.. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది. ద్రోణి ప్రభావంతో ఆదివారం, సోమవారం పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుసే అవకాశం ఉందని పేర్కొంది.. మరికొన్నిచోట్ల ఈదురుగాలులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ రోజు తెలంగాణలోని కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కాగా.. ఆదివారం ఉదయం నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, యాదాద్రి జిల్లాలో వర్షం కురిసింది.. ఇదిలాఉంటే.. ఉత్తర తెలంగాణ లోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వాడగలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రోజు గరిష్టంగా మెదక్ లో 42.9, కనిష్టంగా హనుమకొండ లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఏపీలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.. కోస్తా ఆంధ్ర, రాయలసీమలో ఆదివారం, సోమవారం తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పలుచోట్ల పడే అవకాశం ఉందని.. 30 -40 కిమీ వేగంతో ఈదురుగాలులు కూడా వీయవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.. ఇక దక్షిణ కోస్తాలో చూస్తే ఆదివారం, సోమవారం వాతావరణం పూర్తిగా పొడిగా ఉండే అవకాశం ఉంది.
ఆదివారం అల్లూరి జిల్లా కూనవరం, కాకినాడ జిల్లా జగ్గంపేట, కిర్లంపూడి, ఏలేశ్వరం మండలాల్లో తీవ్రవడగాలులు,17 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు #APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..