లోక్‌సభ ఎన్నికలే టార్గెట్.. గేర్ మార్చబోతున్న బీజేపీ.. ఊహించని ఫలితాలే లక్ష్యం..
2024 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణలో ఎవ్వరితోనూ పొత్తులుండవని పార్టీ ఒంటరిగా లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతుందని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచి త్వరగా బయటపడుతోంది బీజేపీ. ఇకపై ఫోకస్ మొత్తం పార్లమెంట్ ఎన్నికలపైనే. క్యాడర్‌ను కూడా అలాగే సమాయత్తం చేస్తోంది పార్టీ. మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి చాలా బెటర్ రిజల్ట్స్ వచ్చాయి. గెలిచింది 8 మంది ఎమ్మెల్యేలే అయినా.. బీజేపీ తరపున ఇప్పటి వరకు ఎన్నడూ ఇంత మంది ఎమ్మెల్యేలు గెలిచింది లేదు. ఇదొక రికార్డ్. ఒకప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఏడు శాతం ఓటు షేర్‌తో 5 సీట్లు గెలుచుకుంది. 2018లోనూ 7 శాతం ఓట్లు వచ్చినా కేవలం గోషామహల్ సీటు మాత్రమే గెలిచింది. ఇప్పుడు ఏకంగా 14 శాతం ఓట్ షేర్‌తో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అంటే 2018తో పోల్చితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ ఓట్లు వచ్చాయి. బీజేపీకి 35 లక్షల మంది ప్రజలు ఓట్లు వేశారు. ఏకంగా 19 నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఈ 19 సెగ్మెంట్లలో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్‌తో నువ్వానేనా అన్నట్లు కొట్లాడింది బీజేపీ.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 46 నియోజకవర్గాల్లో డిపాజిట్లు దక్కించుకుంది బీజేపీ. డిపాజిట్లు తెచ్చుకోవడం కూడా గొప్పేనా అనుకోవచ్చు గానీ.. బీజేపీ విషయంలో ఇది సాధారణమైన విషయం కాదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏకంగా పాతికవేల చొప్పున ఓట్లు తెచ్చుకుంది. సిద్దిపేటలో ఈసారి బీజేపీకి 23వేల ఓట్లు వచ్చాయి. అంటే.. ఒకప్పుడు ఐదారు వేల ఓట్లు కూడా రాని చోట.. ఈసారి 30 వేలకుపైగా ఓట్లు వచ్చాయి బీజేపీకి. పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల్లో బీజేపీకి ఓట్లు పెరిగాయి. మొన్నటి ఎన్నికల ఫలితాలను జాగ్రత్తగా గమనిస్తే.. ఎవరూ ఊహించని విధంగా సెమీ-అర్బన్‌లో బీజేపీ మంచి ఫలితాలు సాధించిందనే చెప్పాలి. సిర్పూర్ కాగజ్ నగర్, కామారెడ్డి, ముథోల్, ఆదిలాబాద్, ఆర్మూర్, నిర్మల్, ఇవన్నీ సెబీ అర్బన్ ప్రాంతాలే. సో, తెలంగాణ టౌన్‌ల్లోకి బీజేపీ చొచ్చుకెళ్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆదరణ పెరిగితే బీజేపీకి తిరుగులేనట్టే. పైగా ఇప్పటి వరకు బీజేపీ అడుగుపెట్టని స్థానాల్లో ఆ పార్టీ గెలిచింది. అందులోనూ కొత్త వాళ్లే బీజేపీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇది ఓ క్లియర్ కట్ మెసేజ్ పంపుతోంది. బీజేపీ తరపున కొత్త వాళ్లు కొత్త ప్లేస్‌లో గెలిచారంటే.. తెలంగాణలో బీజేపీ మరింత పట్టు బిగించబోతోందనే అర్థం.
పైగా బీజేపీ తరపున సీఎం అభ్యర్ధి ఎవరో తెలియకుండా జరిగిన ఎన్నికలివి. ఇకపై జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మోదీ బొమ్మనే ప్రధానంగా కనిపించబోతోంది. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన మ్యాజిక్కే గనక జరిగితే, ఈసారి కచ్చితంగా బీజేపీకి 30 ప్లస్ ఓట్ షేర్ వస్తుందంటున్నారు. 2018లో బీజేపీకి 7 శాతం ఓట్లు వస్తే.. ఆర్నెళ్లు తిరక్కముందే జరిగిన ఎలక్షన్స్‌లో ఏకంగా 21 పర్సెంట్ ఓట్లు వచ్చాయి. ఇదే మ్యాజిక్ గనక మరోసారి రిపీట్ అయితే.. తెలంగాణ బీజేపీ చెబుతున్నట్టుగా అనూహ్యమైన ఫలితాలే వస్తాయి. అంటే.. 30 ప్లస్ ఓట్ షేర్‌ను ఎక్స్‌పెక్ట్ చేస్తోంది. అటు బీజేపీ కూడా డబుల్ డిజిట్ సీట్లు వస్తాయని బల్లగుద్ది మరీ చెబుతోంది. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలున్నాయి. కచ్చితంగా 10 లేదా పదికిపైనే లోక్‌సభ స్థానాలను సాధిస్తామంటున్నారు.
ఇక్కడో విషయాన్ని స్పష్టంగా చెప్పదలచుకుంది బీజేపీ. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవు. నూటికి నూరుపాళ్లు సింగిల్ పార్టీగా ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కూడా ఇదే విషయం చెప్పారు. మోదీ ఫొటోతో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి.. సింగిల్‌గానే సత్తా చాటగలమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమకు కాంగ్రెస్ పార్టీ ఎంత విరోధో.. బీఆర్ఎస్ కూడా అంతే విరోధి అనే ప్రచారాన్ని కూడా మొదలుపెట్టింది. పైగా కాంగ్రెస్, ఎంఐఎం ఒకటేనన్న విషయాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటోంది బీజేపీ. ఇప్పటికే, రాజాసింగ్ లాంటి వాళ్లు ఈ ప్రచారం మొదలుపెట్టారు. అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్‌ని చేయడం, గ్రేటర్ హైదరాబాద్‌పై సమీక్షలో ఒవైసీని పక్కనే కూర్చోబెట్టుకోవడాన్ని బీజేపీ హైలెట్ చేసింది. అదే సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ ఎన్నటికీ ఒక్కటి కాదని కుండబద్దలు కొడుతోంది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి డబుల్ డిజిట్ సీట్లు టార్గెట్ పెట్టుకుంది బీజేపీ. బాగానే ఉంది గానీ.. నిజంగా అంత ఆస్కారం ఉందా? బీజేపీలోని కొందరు నాయకులు చెబుతున్న దాని ప్రకారం.. ఇప్పటికిప్పుడు 10 స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వగలదు బీజేపీ. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్, భువనగిరి, జహీరాబాద్, మెదక్, మల్కాజిగిరి, చేవెళ్ల. ఈ పది స్థానాలపై బీజేపీకి ఆశలున్నాయి. ఎటొచ్చీ.. ఖమ్మం, నల్లగొండ, వరంగల్, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, హైదరాబాద్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల్లో అడుగుపెట్టడంపై బీజేపీకే కొన్ని సందేహాలు ఉన్నట్టు చెబుతున్నారు. పైగా ఈసారి లోక్‌సభ ఎన్నికలకు కాస్త గట్టి వాళ్లే పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. బహుశా ఈటల రాజేందర్ జహీరాబాద్ నుంచి పోటీ చేయొచ్చంటున్నారు. కామారెడ్డిలో బీజేపీ గెలవడంతో ఆ సానుకూలత జహీరాబాద్ పార్లమెంట్‌కు పనికొస్తుందంటున్నారు. మెదక్ నుంచి రఘునందన్, మల్కాజిగిరిలో మురళీధర్‌రావు లేదా రామచంద్రరావు, చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి బంగారు శృతి, కరీంనగర్‌లో బండి సంజయ్, నిజామాబాద్‌లో అర్వింద్ ధర్మపురి, ఆదిలాబాద్‌లో సోయం బాపూరావు.. ఇలా కొంతమందిని సిద్ధం చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పది లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీకి గట్టి ఫుట్‌ప్రింట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక కష్టపడాల్సింది మిగిలిన ఏడు సెగ్మెంట్లలోనే. అందులోనూ, ఖమ్మం, నల్లగొండ, వరంగల్, హైదరాబాద్‌ను వదిలిపెట్టాల్సి ఉంటుంది. అక్కడ బీజేపీకి సరైన అభ్యర్ధులు కూడా లేరని బీజేపీ వర్గాలే చెబుతున్నాయి. సో, వచ్చే ఎన్నికల్లో బీజేపీ వేసుకుంటున్న లెక్కలకు కొంత వాస్తవికత కనిపిస్తోంది. పది లేదా పది కంటే ఎక్కువ స్థానాలపై గురిపెట్టబోతోంది. ఇందుకోసం, జాతీయ నాయకత్వం కూడా ప్రత్యేక వ్యూహంతో రాబోతున్నట్టు చెబుతున్నారు.
ఓటర్లు కూడా లోక్‌సభ ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికల్లా చూడరు. మోదీ వర్సెస్ రాహుల్‌గాంధీ అన్నట్టుగా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి.. ఆ తీర్పు విభిన్నంగానే ఉండొచ్చుంటున్నారు. ఇప్పుడు బీజేపీ వేసుకున్న లెక్కల ప్రకారం.. మోదీకే ఎక్కువ అవకాశం ఉందని, సో డబుల్ డిజిట్ సీట్లు వస్తాయని చెబుతున్నారు. నమో తెలంగాణ ఆపరేషన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.