
హైదరాబాద్‌లో ఇప్పటికే ఇనార్టిట్, లూలూ, మంజీరా, నెక్సస్ లాంటి పెద్ద మాల్స్ ఉండగా.. ఇటీవల కూకట్‌పల్లిలో సిటీలో అతి పెద్ద మాల్ లేక్‌షోర్ ప్రారంభమైంది. ఇప్పటికే ఈ మాల్స్ నగరవాసులకు షాపింగ్‌తో పాటు ఆహ్లాదాన్ని పంచుతుండగా.. రానున్న రోజుల్లో మరో పెద్ద మాల్ రానుంది. అదే స్విల్ మాల్. ప్రపంచంలోనే ఇప్పటివరకు ఎక్కడా లేని స్విస్ మాల్ అందుబాటులో ఏర్పాటు కానుంది. ఇందులో కేవలం షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్‌నే కాకుండా స్విస్ విద్య, నైపుణ్య, సంస్కృతికి ట్రైనింగ్ కేంద్రంగా మారనుంది. హైదరాబాద్‌లో ఈ మాల్ ఏర్పాటు కోసం సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఒప్పందం కుదిరింది.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఈ కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంటుంది. ఈ క్రమంలో స్విట్జర్లాండ్‌కు చెందిన వాడ్ కౌన్సిల్ చీఫ్ మినిస్టర్ క్రిస్టెల్ లూయిసియర్ బ్రోడార్డ్‌తో రేవంత్ భేటీ అయ్యారు. ఈ భేటీలో హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాలని రేవంత్ కోరగా.. వెంటనే స్విస్ బృందం అంగీకరించింది. హైదరాబాద్‌లో స్విస్ మాల్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. ప్రపంచంలోనే ఎక్కడా లేని ఈ మాల్ తొలిసారి హైదరాబాద్‌లో ఏర్పాటు కావడంపై రేవంత్ హర్షం వ్యక్తం చేశారు.
ఇక స్విస్ ప్రతినిధులతో జరిగిన భేటీలో పలు కీలక ఒప్పందాలు జరిగాయి. ఫుట్ బాల్ ట్రైనింగ్, అంతర్జాతీయ సౌకర్యాలు కల్పించడంపై స్విస్ భాగస్వామ్యాన్ని రేవంత్ కోరారు. ఇందుకు స్విస్ ప్రతినిధులు ముందుకొచ్చారు. అలాగే హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, నైపుణ్యాభివృద్దిలో ట్రైనింగ్ ఇచ్చేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. ఇక రిటైల్, లైఫ్ సైనెన్స్ రంగంలో పలు ఒప్పందాలు జరిగాయి. అటు స్విస్ మాల్ ఏర్పాటుతో హైదరాబాద్ రిటైల్ హాబ్‌గా మారుతుందని రేవంత్ రెడ్డి ఆశించారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047లో భాగంగా గ్లోబల్ రిటైల్ హాబ్‌గా హైదరాబాద్‌ను మార్చుతామన్నారు. త్వరలోనే స్విస్ బృందం హైదరాబాద్ పర్యటనకు రానుంది. మాల్ ఏర్పాటుపై చర్చలు జరపడంతో పాటు స్థలం పరిశీలన చేపట్టనుంది. ప్రభుత్వం పలు రాయితీలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అటు దావోస్ పర్యటనలో రేవంత్ రెడ్డితో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.