హైదరాబాద్‌లోని చాదర్ ఘాట్‌లో బుధవారం ఉదయం ఓ స్విఫ్ట్ కార్ బీభత్సం సృష్టించింది. రోడ్డుపై నడిచి వెళ్తున్న ఒక వ్యక్తిని ఢీకొట్టి కొద్ది దూరం వెళ్లి మళ్లీ డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారు నడుపుతున్న మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఇంత జరిగినా ఆ మహిళ కారులో నుంచి దిగకుండా మొండికేసింది. కొద్ది సేపు నానా హంగామా సృష్టించింది. చివరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పుడు కూడా ఆమె కిందకు దిగేందుకు ససేమిరా అంది. దీంతో పోలీసులు ట్రాఫిక్ క్రేన్ సహాయంతో ఆమెతో పాటు కారును పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
టీఎస్ 08 GN0830 నంబర్ గల కారులో వచ్చిన మహిళ ముందుగా రోడ్డుపై నడిచి వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. అంతటితో ఆగక కొద్ది దూరం వెళ్లి మళ్లీ డివైడర్‌ను ఢీకొట్టి ఆగిపోయింది. అయితే కారు నడిపిన మహిళ మద్యం మత్తులో ఇలా చేసిందా లేదా మతిస్థిమితం కోల్పోయి హంగామా సృష్టించిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.