ముజ్రా పార్టీలు అంటూ గలీజ్ దందాలకు పాల్పడుతూ చుట్టుపక్కల వారిని ఇబ్బందులకు గురి చేసిన సంఘటన హైదరాబాద్ నగరం బాలాపూర్ పరిధిలోని అలీనగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. తప్పతాగి చిందులేస్తూ ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇలా కొందరు చేసే గలీజ్ పనులపై పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ట్రాన్స్ జెండర్లను పిలిచి వారిచేత అర్ధరాత్రి వరకు డాన్సులు చేయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. బాలాపూర్ పరిధిలోని అలీనగర్ ప్రాంతంలో స్థానికంగా ఉండే కొందరు నిత్యం ట్రాన్స్ జెండర్స్‌ను పిలిచి ముజ్రా పార్టీ అంటూ వెర్రి వేషాలు వేస్తున్నారు. తప్పతాగి పెద్ద పెద్ద శబ్దాలతో చెవులకు చిల్లులు పడేలా స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీని గురించి పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అక్కడివారు వాపోతున్నారు. అర్ధరాత్రులు నిద్ర పోనివ్వకుండా ఇదేం పార్టీలు అంటూ నిలదీస్తే గొడవకు దిగుతున్నారని, చేసేది లేక పోలీసులకు చెబితే అక్కడి నుంచి కూడా ఎలాంటి సహకారం లభించడం లేదని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. ఎలాగైనా ఈ ముజ్రా పార్టీలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుని ఇవన్నీ ఆపివేయించాలని కోరుతున్నారు.
అసలు ముజ్రా పార్టీ అంటే ఏవైనా శుభకార్యాల వేళ ట్రాన్స్‌జెండర్లతో డ్యాన్సులు, పలు కార్యక్రమాలు లాంటివి నిర్వహించడం.. కానీ, ఇక్కడ మాత్రం ట్రాన్స్ జెండర్లను పిలిపించి వారిని అందంగా రెడీ చేయించి, వారు డాన్సులు చేస్తుంటే చూసి ఎంజాయ్ చేస్తున్నారంటూ స్థానికులు చెబుతున్నారు. ముజ్రా పార్టీల పేరిట పెద్ద పెద్ద శబ్దాలతో పాటలు పెట్టడం, ఆ పాటలకు డాన్సులు చేయించడం, అది చూసి కొందరు ఎంజాయ్ చేయడం సాధారణం అయిపోయిందని అలీనగర్ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. కుటుంబాలతో కలిసి ఇక్కడ నివసించే తమకు ఇదంతా ఇబ్బందిగా మారిందని, ఒక్కోసారి ఈ ముజ్రా పార్టీల చర్యలు హద్దులు కూడా దాటుతున్నాయని పేర్కొంటున్నారు. ఎలాగైనా ఈ సమస్య నుంచి తమకు పరిష్కారం చూపించాలని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..