
హైదరాబాద్‌లో ప్రజా రవాణాను అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి రెడీ అయింది. అదే ఎంఎంటీఎస్. మెట్రో, ఆర్టీసీ రవాణాను ఏకీకృతం చేయనుంది. నగరంలోని ఆర్టీసీ, ఎంఎంటీఎస్, మెట్రో సేవలను అనుసంధానం చేయనుంది. దీని వల్ల ప్రమాణ దూరం, సమయం తగ్గేలా భారీ ప్రణాళికలను సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగా మెట్రో దిగగానే ఆర్టీసీ బస్సులు రెడీగా ఉండేలా, సులువుగా ఎంఎంటీఎస్ స్టేషన్‌కు చేరుకునేలా ఏర్పాట్లు చేయనుంది. అలాగే ఎంఎంటీఎస్ స్టేషన్ నుంచి బయటకు రాగానే మెట్రో స్టేషన్లకు సులువుగా చేరుకునేలా, బస్సులు అందుబాటులో ఉండేలా అనుసంధానించనుంది. ఇందుకోసం స్కైవాక్, స్కైవేలు కొత్తగా నిర్మించేందుకు సిద్దమవుతోంది. ఇప్పటివరకు మెట్రో స్టేషన్ దిగాగానే ఎంఎంటీఎస్ స్టేషన్ లేదా ఆర్టీసీ బస్టాప్‌కు చేరుకోవాలంటే కొంతదూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఇప్పుడు అన్నీ ఒకేచోట పొందేలా సౌకర్యాలు కల్పించడం వల్ల ప్రయాణికులకు ఊరట లభించనుంది. ఇందుకోసం హెచ్‌ఎండీఏ పరిధిలోని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ క్షేత్రస్థాయిలో రీసెర్చ్ చేస్తోంది.
మెట్రో స్టేషన్ల నుంచి కిందకు దిగకుండానే నేరుగా ఎంఎంటీఎస్ స్టేషన్లకు చేరుకునేలా స్కైవాక్, స్కైవేలు నిర్మించనున్నారు. బేగంపేట, నాంపల్లి, భరత్ నగర్, ఖైరతాబాద్‌తో పాటు పలు మెట్రో స్టేషన్ల నుంచి నేరుగా ఎంఎంటీఎస్ స్టేషన్‌కు చేరుకునేలా స్కైవాక్, స్కైవేలు నిర్మించనున్నారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్ సమీపంలోని బస్టాప్‌లను ఒకే మార్గంతో అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందించారు. అలాగే మెట్రో స్టేషన్ దిగానే నేరుగా రైల్వే స్టేషన్‌కు చేరుకునేలా స్కైవాక్ నిర్మాణం చేయనున్నారు. దీంతో మెట్రో స్టేషన్ దిగగానే నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవచ్చు.
ఇక ఎంఎంటీఎస్ దగ్గర బస్టాప్‌లు అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని ద్వారా ఎంఎంటీఎస్ దిగగానే ఆర్టీసీ బస్టాపులు దగ్గర్లో ఉండం వల్ల ప్రయాణికులకు జర్నీ సమయం తగ్గుతుంది. ఇప్పటివరకు బస్టాఫులు దూరంగా ఉండటం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఎంఎంటీఎస్ దిగానే బస్టాప్ కోసం నడవాల్సి ఉంటుంది. దీంతో బస్టాపులను ఎంఎంటీఎస్ స్టేషన్ల దగ్గరకు తరలించనున్నారు. అలాగే బస్టాపుల దూరంగా ఉన్న ప్రాంతాల్లో ప్రయాణికుల కోసం బ్యాటరీ వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటి ద్వారా తక్కువ ధరకే ప్రయాణించే సౌకర్యం అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం నగరంలో 51 ఎంఎంటీఎస్ స్టేషన్లు ఉండగా.. 21 స్టేషన్ల దగ్గర మాత్రమే బస్టాపులు ఉన్నాయి.