హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ 2024లో అద్భుతమైన ఫలితాలు సాధించింది. కార్యాలయాలు, ఇళ్ల అమ్మకాలు, లీజింగ్ వ్యవహారాల్లో గణనీయమైన వృద్ధి కనిపించింది. నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్థ విడుదల చేసిన నివేదిక వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
ఆఫీస్ స్పేస్ హై డిమాండ్ –
2024లో హైదరాబాద్‌లో 1.03 కోట్ల చదరపు అడుగుల కార్యాలయ స్థలాలు అమ్మకాలు లేదా లీజింగ్ చేసాయి. 2023తో పోలిస్తే ఇది 17% ఎక్కువ. హైటెక్ సిటీ ప్రాంతంలో ఎక్కువగా డిమాండ్ ఉంది. అలాగే 1.56 కోట్ల చదరపు అడుగుల కొత్త కార్యాలయ భవనాల నిర్మాణం పూర్తయింది, ఇది 139% వృద్ధికి సూచన.
ఇళ్ల విక్రయాలలో కూడా ఈ సారి టాప్ –
ఇళ్ల విక్రయాలు కూడా మంచి వృద్ధిని సాధించాయి. గత ఏడాది 36,974 గృహాలు అమ్ముడయ్యాయి, ఇది 2023తో పోలిస్తే 12% ఎక్కువ. సగటు గృహ ధరలు 8% పెరిగాయి. ముఖ్యంగా రూ. కోటి నుంచి రూ. 2 కోట్ల మధ్య ధర ఉన్న ఇళ్లకు చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. అమ్ముడైన ఇళ్లలో 45% వాటా ఈ రేంజ్‌లో ఉంది.
వృద్ధికి కారణాలు-
పలు అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌ను తమ కార్యాలయాలకు ఎంపిక చేసుకోవడం వల్ల డిమాండ్ పెరిగింది. అందులో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (GCCs) ప్రముఖమైనవి.
కొత్త ప్రాజెక్టుల ప్రారంభం
కొత్త గృహ ప్రాజెక్టుల ప్రారంభం కొద్దిగా తగ్గినప్పటికీ, ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులకు డిమాండ్ అధికంగా ఉంది.
•కార్యాలయ స్థలాల అమ్మకాలు: 1.03 కోట్ల చదరపు అడుగులు
•నివాస గృహాల విక్రయాలు: 36,974 యూనిట్లు
•గృహ ధరల పెరుగుదల: 8%
•రూ. కోటి-రూ. 2 కోట్ల ఇళ్ల వాటా: 45%
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దేశంలోనే అతిపెద్ద కేంద్రంగా ఎదుగుతోంది. ఇళ్లకు, కార్యాలయ భవనాలకు డిమాండ్ ఇప్పటికీ పెరుగుతూ ఉండటంతో రియల్ బిజినెస్ లో జోష్ వచ్చింది.