గ్రేటర్ హైదరాబాద్ వాసులకు హైదరాబాద్ జలమండలి గుడ్ న్యూస్ చెప్పింది. వాటర్ బిల్లుల చెల్లింపు కోసం తీసుకొచ్చిన ఓటీఎస్ స్కీమ్ 2024 నిబంధనలను సడలింపు చేసింది. వినియోగదారుల నుంచి భారీగా విజ్ఞప్తులు రావడంతో జలమండలి ప్రభుత్వం OTS-2024 పథకం గడువును అక్టోబర్ 31 నుంచి నవంబర్ 30 వరకు పొడిగించింది. OTS-2024 కింద ప్రయోజనం పొందే ప్రక్రియను సులభతరం చేసే దిశగా.. ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించే నిబంధనను సడలించి.. దాని స్థానంలో హామీ పత్రం సమర్పించే వెసులుబాటును కల్పించింది. దీంతో OTS-2024 కింద ప్రయోజనం పొందాలనుకునే వినియోగదారులు అఫిడవిట్ స్థానంలో హామీ పత్రం సమర్పించవచ్చు.
గతంలో ఏ ఓటీఎస్ పథకం ద్వారా ప్రయోజనం పొందిన వినియోగదారులకు 50 శాతం వరకు బిల్లు మాఫీ అవుతుంది. అయితే వినియోగదారుల నుంచి విజ్ఞప్తుల దృష్ట్యా ఇప్పుడు ఆ నిబంధనను సడలించారు. అర్హత ఉన్న కస్టమర్ మాత్రమే పథకం ద్వారా 50% ప్రయోజనం పొందుతారు. గతంలో ఓటీఎస్ 2020 తప్పా ఏ ఓటీఎస్ పథకం ద్వారా ప్రయోజనం పొందినా వినియోగదారులకు వంద శాతం రాయితీ పొందేలా ఆ షరతును సడలించింది.
ఓటీఎస్ పథకంపై ఏవైనా సందేహాలుంటే.. జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313కు ఫోన్ చేసి వాటిని నివృత్తి చేసుకోవచ్చు. ఈ పథకంపై అధికారులు ఇప్పటికే అన్ని మాధ్యమాల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. వినియోగదారుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు.. ఓటీఎస్ గడువును ప్రభుత్వం మరోసారి పెంచి.. నిబంధలను సైతం సవరించినట్లు జలమండలి ఎండీ అశోక్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం నిబంధనల సడలింపుతో ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుతుందని జలమండలి అధికారులు తెలిపారు.