Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. వచ్చే 2 రోజులు జోరున వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్

|

Aug 25, 2024 | 8:20 AM

సగటు సముద్ర మట్టానికి పైన 7.6 కి.మీ.ల వరకు ఆవర్తనం విస్తరించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వల్ల వచ్చే 2 రోజులు తెలంగాణలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అటు ఆదిలాబాద్, కొమరం భీం..

Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. వచ్చే 2 రోజులు జోరున వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్
Ts Rains
Follow us on

సగటు సముద్ర మట్టానికి పైన 7.6 కి.మీ.ల వరకు ఆవర్తనం విస్తరించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వల్ల వచ్చే 2 రోజులు తెలంగాణలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అటు ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందన్నారు. హైదరాబాద్‌లోనూ ఆకాశం మేఘావృతమై.. పలు ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.

దేశమంతా భారీ వర్షాలు..

దేశమంతా వరుణుడి గర్జన కొనసాగుతోంది. మధ్యప్రదేశ్‌ , తమిళనాడు , బెంగాల్‌తో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్‌ లోని ఉజ్జయినిలో ఆలయాల లోకి వరదనీరు చేరింది. చత్తీస్‌గడ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు- కర్నాటక సరిహద్దులో వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తమిళనాడు లోని దిండిగల్‌లో ఉన్న వరదమానది డ్యాం పూర్తిగా నిండిపోయింది. దీంతో డ్యాం లోని అన్ని గేట్లను ఎత్తడంతో అద్భుతమైన జలదృశ్యం కనువిందు చేస్తోంది. భారీ వర్షాల కారణంగా పళని జిల్లాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా లోని చాలా డ్యాంలు కూడా పూర్తిగా నిండిపోయాయి. డ్యాంలు నిండడంతో ఆ ప్రాంతం లోని రైతులంతా చాలా ఆనందంగా ఉన్నారు. మరోవైపు బెంగాల్‌లో కూడా భారీవర్షాలు కురుస్తున్నాయి. కోల్‌కతాలో ఎటు చూసినా వరదనీరే కన్పిస్తోంది. సబ్‌వేల లోకి కూడా వర్షం నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంగళాఖాతంలో అల్పపీడనం కారణంగా బెంగాల్‌ లోని చాలా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఉజ్జయినిలో భారీ వర్షాల కారణంగా జనజీవితం స్తంభించింది. ఉజ్జయినిలో పలు కాలనీలు నీట మునిగాయి.