హైదరాబాద్, 14 జనవరి 2025: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగిన డబుల్ మర్డర్ ఘటన కలకలం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ డబుల్ మర్డర్ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. మృతులను పోలీసులు గుర్తించారు. పుప్పాల్‌గూడ అనంత పద్మనాభస్వామి ఆలయ గుట్టల వద్ద యువతి, యువకుడు దారుణ హత్యకు గురికావడం తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా మంగళవారం ఉదయం స్థానికులు కొందరు గుట్టపై నుంచి గాలిపటాలు ఎగరేస్తుండగా అక్కడ ఓ మృతదేహాన్ని గుర్తించి షాక్‌కు గురైయ్యారు. దీనిపై పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. ఆ వ్యక్తి మృతదేహానికి కొన్ని మీటర్ల దూరంలోనే పడి ఉన్న మరో మహిళ డెడ్‌బాడీని గుర్తించారు. తలపై బండరాయితో కొట్టి ఇద్దరినీ అత్యంత దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ యువతి, యువకుల వివరాలను నార్సింగి పోలీసులు గుర్తించారు. యువకుడు మధ్యప్రదేశ్‌కి చెందిన అంకిత్ సాకేత్ (25)గా గుర్తించారు. సాకేత్ హౌస్ కీపింగ్ పనిచేస్తూ నానక్‌రామ్‌గూడలోని హనుమాన్ టెంపుల్ సమీపంలో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. యువతి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బిందు(25)గా గుర్తించారు. ఆమె ఎల్బీ నగర్‌లో నివాసం ఉంటోంది. మృతులిద్దరికీ పరిచయం ఉందని ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించినట్లు రాజేందర్ నగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 8న సాకేత్ బిందుని ఎల్బీ నగర్ నుంచి తీసుకొచ్చి నానక్‌రామ్‌గూడలోని తన స్నేహితుడి రూమ్‌లో ఉంచాడు. 11న రాత్రి హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వీరి హత్యకు కారణాలపై పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.