హైడ్రా యమా స్పీడు మీదుంది. తెలంగాణ రాష్ట్ర ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా… దూసుకెళ్తోంది. చెరువులు, కబ్జా స్థలాల్లోని నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చిపడేస్తోంది. రాజకీయ నేతల బిల్డింగులను సైతం బద్దలు కొడుతోంది హైడ్రా టీమ్. సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్‌గా, రంగనాథ్ కమిషనర్‌గా పనిచేస్తున్న హైడ్రా.. ఈ అక్రమ కట్టడాల కూల్చివేతను పాతబస్తీ నుంచే ప్రారంభించింది. చెరువులు, కబ్జా స్థలాల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ ఆక్రమణదారుల గుండెల్లో నిద్రపోతోంది. ఫిర్యాదులు అందిన వెంటనే స్పందిస్తూ చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చురుకుగా వ్యవహరిస్తున్నారు. పాతబస్తీ హసన్ నగర్ కింగ్ కాలనీలో.. చెరువును కబ్జా చేసి అక్రమ కట్టడాలను కడితే.. హైడ్రా వాటిని కూల్చేసింది. అక్రమ కట్టడాలు రాజకీయ నాయకులకు చెందినవైనా సరే.. ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు హైడ్రా. బిల్డింగులను కూల్చివేస్తుంటే అడ్డుకోవడానికి వచ్చిన బహదూర్‌పురా ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్‌ను పోలీకసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక కార్పొరేటర్‌తో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని మరీ.. కూల్చివేతలను కంటిన్యూ చేశారు అధికారులు. మొత్తం 13 మల్టీ స్టోరీడ్ బిల్డింగులు, 40 కాంపౌండ్ వాల్స్‌ను భారీ యంత్రాలతో కూల్చివేశారు.
కింగ్ కాలనీలో ఆక్రమణలకు గురైన ఈ చెరువును 1770 సంవత్సరంలో అప్పటి హైదరాబాద్ ప్రధానమంత్రి నవాబ్బమ్ రుకునుత్ దౌలా తన పేరు పైనే ఏర్పాటు చేశారు, కాలక్రమేణా ఆ 104 ఎకరాల చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుని చాలా వరకు చిక్కిపోయింది. ఇప్పుడు ప్రభుత్వ రికార్డుల్లో మిగిలి ఉన్న చెరువును కాపాడుకునేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు, చెరువులు, ప్రభుత్వ భూములను కాపాడుకునేందుకు పాతబస్తీ నుంచే అధికారులు యుద్ధం ప్రకటించారు. హైదరాబాద్ పాతబస్తీ అక్రమ కట్టడాల కూల్చివేతపై బహదూర్‌పూర్ ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ మొబిన్ స్పందించారు.. స్థానికంగా ఉన్న ప్రజలు భూములు కొనుక్కుని అనుమతులు తీసుకునే ఇళ్లు కట్టుకున్నారన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే అధికారులు కూల్చివేశారని మండిపడ్డారు, అవి నిజంగా FTL భూములైతే కట్టుకోవడానికి అధికారులు ఎందుకు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు.
ఇక చందానగర్ సర్కిల్ హఫీజ్‌పేట్ డివిజన్ వైశాలి నగర్ లో FTL ల్యాండ్‌లో అక్రమంగా నిర్మిస్తున్న మూడు భవనాలను గుర్తించిన హైడ్రా అధికారులు…వాటిని కూల్చివేశారు. ఈ కూల్చివేత పనులు కూడా డే అండ్ నైట్ నాన్‌స్టాప్‌గా జరుగుతున్నాయి. లోటస్ పాండ్ నుంచి మొదలైన అక్రమ నిర్మాణాలకు కూల్చివేత క్రమక్రమంగా స్పీడ్ అందుకుంది. గాజులరామారం చెరువులో 51 నిర్మాణాలను కూల్చివేశారు. నందగిరి హిల్స్, గురు బ్రహ్మ నగర్ లో వెలసిన 17 తాత్కాలిక అక్రమ నిర్మాణాలను జేసీబీలతో తొలగించారు. చందానగర్ సర్కిల్ మదీనాగూడ ఈర్ల చెరువు ప్రాంతంలో మూడు మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ కూల్చి వేశారు. చెరువుల ఆక్రమణలను అడ్డుకోకపోతే హైదరాబాద్ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. బఫర్ జోన్‌లో ఎవరూ స్థలాలు కొనుగోలు చేయవద్దని సూచించారు. ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తే హైడ్రా చర్యలు తప్పవని హెచ్చరించారు. చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తామన్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..