Hyderabad: న్యూఇయర్ వేళ హైదరాబాదీలకు పోలీసులు హెచ్చరిక.. అలా చేస్తే అంతే సంగతులు.. రూల్స్ ఇవే!

|

Dec 29, 2022 | 4:08 PM

Hyderabad New Year Restrictions: మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. న్యూఇయర్‌ను గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు హైదరాబాద్ యువత కూడా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

Hyderabad: న్యూఇయర్ వేళ హైదరాబాదీలకు పోలీసులు హెచ్చరిక.. అలా చేస్తే అంతే సంగతులు.. రూల్స్ ఇవే!
New Year Rules Hyderabad
Follow us on

మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. న్యూఇయర్‌ను గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు హైదరాబాద్ యువత కూడా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అయితే నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు నగరంలో పలు రూల్స్ అమలులో ఉంటాయని.. వాటికి అనుగుణంగా తమ ప్రయాణాలను సెట్ చేసుకోవాలని సూచించారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో రోడ్లు, నగరంలోని ఫ్లైఓవర్లు మూసి ఉంటాయని వెల్లడించారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు ఔటర్ రింగ్ రోడ్డు, పీవీఆర్ ఎక్స్‌ప్రెస్‌వే మూసి వేయబడతాయి. అయితే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లే ప్రయాణీకులు మాత్రం టికెట్లు చూపి వెళ్లొచ్చునని పోలీసులు తెలిపారు. అలాగే నగరంలోని శిల్పా లేఅవుట్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, షైక్‌పేట్, మైండ్‌స్పేస్, రోడ్ నెం.45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, సైబర్ టవర్స్, ఫోరమ్ మాల్- జేఎన్టీయూ, ఖైత్లాపూర్, బాలానగర్ ఫ్లైఓవర్లలన్నీ కూడా ఆ రోజు రాత్రి 11 గంటల నుంచి జనవరి 1న ఉదయం 5 గంటల వరకు బంద్ అవుతాయి. ఆ సమయంలో ఈ ఫ్లైఓవర్లపై వాహనాల రాకపోకలు, పాదచారుల కదలికలపై పోలీసులు పూర్తిగా నిషేధం విధించారు.

మరోవైపు ఆరోజు రాత్రి 10 గంటల తర్వాత క్యాబ్, ట్యాక్సీ, అటో డ్రైవర్లు సరైన యూనిఫారం వేసుకోవడంతో పాటు.. తమతో వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను ఉంచుకోవాలని సూచించారు. ఏ ఒక్క రైడ్‌ను నిరాకరించకూడదని.. ఒకవేళ అలా చేసినట్లయితే రూ. 500 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ అంశంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాహనం నెంబర్, సమయం, స్థలం మొదలైన వివరాలను జత చేసి తమ ఫిర్యాదులను 9490617346 వాట్సాప్ నెంబర్‌కు పంపవచ్చునన్నారు. అలాగే బార్/పబ్/క్లబ్స్ తమ కస్టమర్లను మద్యం సేవించి వాహనం నడపడానికి అనుమతించకూడదని పోలీసులు తెలిపారు. ఒకవేళ అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వారి ప్రయాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాలన్నారు. అటు డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10 తర్వాత నగరంలోని ప్రధాన కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ ఉంటాయని.. వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించకపోతే.. బండిని స్వాధీనం చేసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

మైనర్ల చేత డ్రైవింగ్, అధిక వాల్యూమ్‌తో మ్యూజిక్ ప్లే చేస్తూ కారు నడపడం, నెంబర్ ప్లేట్ కనిపించకుండా మాస్క్ అడ్డుపెట్టడం, వాహనాల పైభాగంలో ప్రయాణించడం, బహిరంగ ప్రదేశాల్లో ఇబ్బంది కలిగించడం వంటివి చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, మితిమీరిన హారన్‌లు, ట్రిపుల్ రైడింగ్ వంటి రూల్స్‌ను అతిక్రమించినా కేసులు తప్పవని.. మద్యం తాగి వాహనాలు నడిపితే రూ. 10 వేల ఫైన్, 6 నెలల జైలు శిక్ష పడుతుందని పోలీసులు హెచ్చరించారు.