Jubilee Hills By Election: జూబ్లీహిల్స్‌ చౌరస్తాలో మార్మోగుతున్న అన్నగారి పేరు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహం మామూలుగా లేదుగా..

జూబ్లీహిల్స్ ప్రచారంలో ఎన్టీఆర్ పేరు మారుమోగుతోంది. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ అన్నగారి పేరు పదేపదే ప్రస్తావిస్తున్నాయి. అసలు జూబ్లీహిల్స్‌ ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్‌ పేరు ఎందుకు వచ్చింది..? అటు కాంగ్రెస్‌.. ఇటు బీఆర్ఎస్ వ్యూహం ఏంటి..? అనేది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో చర్చనీయాంశంగా మారింది.

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్‌ చౌరస్తాలో మార్మోగుతున్న అన్నగారి పేరు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహం మామూలుగా లేదుగా..
Jubilee Hills By Election

Updated on: Nov 08, 2025 | 9:28 AM

సీనియర్ ఎన్టీఆర్ కాలం చేసి సుమారు 30 ఏళ్లు అవుతున్నా… ఆయన పేరు రాజకీయాలను ఇంకా శాసిస్తూనే ఉంది. ఏదో రకంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అన్నగారి పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇపుడు విషయం ఏమిటంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలోనూ అన్నగారి పేరు బాగా వినబడుతోంది. జూబ్లీహిల్స్‌లోని అనేక సామాజికవర్గాల్లో కమ్మవారు కూడా గణనీయమైన సంఖ్యలోనే ఉన్నారు. ఆ ఓటు బ్యాంక్‌ను ఆకర్షించడానికి ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నాయి. దీంతో ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ పేరు మార్పోగుతోంది.

ఇటీవల సీఎం రేవంత్‌ రెడ్డితో కమ్మ సంఘం నేతల భేటీ

మొన్నీ మధ్య జూబ్లీహిల్స్‌ కమ్మ సంఘం నేతలు సీఎం రేవంత్‌ రెడ్డితో భేటీ అయ్యారు. వారి సమస్యలు విన్న సీఎం సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారంతో పాటుగానే అమీర్‌పేట్‌లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలోనూ అమీర్‌పేటలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని పెట్టే బాధ్యత తనదేన్నారు రేవంత్‌రెడ్డి.

ఎన్టీ రామారావు పేరు ఎత్తే అర్హత కాంగ్రెస్‌కు లేదన్న కేటీఆర్‌

కాంగ్రెస్ పార్టీకి స్వర్గీయ ఎన్టీ రామారావు పేరు ఎత్తే నైతిక అర్హత లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్‌. శంషాబాద్ విమానాశ్రయానికి పెట్టిన ఎన్టీఆర్ పేరును తొలగించి కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ పేరు పెట్టిందని గుర్తు చేశారు. ఎన్టీ రామారావుపై గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. తన జీవితమంతా వ్యతిరేకంగా పోరాడిన కాంగ్రెస్ పార్టీ గనుక ఎన్టీ రామారావు విగ్రహాలు పెడితే ఆయన ఆత్మ ఘోషిస్తుందన్నారు. కమ్మసామాజిక వర్గం కోరినట్లు తామే ఎన్టీఆర్‌ విగ్రహం పెడతామని.. గతంలో ఖమ్మం సహా పలు చోట్ల ఎన్టీఆర్‌ విగ్రహాలు పెట్టినట్లు గుర్తు చేశారు కేటీఆర్‌.

ఎన్టీఆర్ అభిమానులు, కమ్మ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్‌పై ఫోకస్‌

మొత్తంగా ఇటు బీఆర్‌ఎస్‌… అటు కాంగ్రెస్‌ ఎన్టీఆర్ అభిమానులు, కమ్మ సామాజిక వర్గం ఓటు ఓట్ బ్యాంక్‌ను తమవైపు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్టీఆర్ చరిష్మా క్లెయిమ్ చేసుకునేందుకు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నారు. దీంతో జూబ్లీహిల్స్‌ ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్‌ పేరు గట్టిగా వినిపిస్తోంది. మరి కమ్మ సామాజిక వర్గపు ఓటర్లు ఎవరి హామీకి మొగ్గు చూపుతారో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..