Hyderabad News: ఐటీ సంస్థలకు, భారీ నిర్మాణాలకు పెట్టింది పేరు మదాపూర్. అయితే ఈ ప్రాంతం ప్రస్తుతం అత్యంత ఖరీదైన ప్రాంతంగా మారిపోయింది. దీంతో పెట్టుబడిదారులు మరో ప్రాంతాన్ని పెట్టుబడికి ఎంచుకుంటున్నారు. పెట్టుబడులను ఉత్తర హైదరాబాద్ వైపు చూపుస్తున్నారు. కొంపల్లి, కండ్లకోయ, శామీర్‌పేట, మేడ్చల్‌లో క్రమంగా పెట్టుబడులు పెరుగుతుండడమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. తెలంగాణ ప్రభుత్వం కండ్లకోయలో ఐటీ పార్కును నిర్మించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో భవిష్యత్తులో ఐటీకి ఈ ప్రాంతం అడ్డాగా మారనున్నట్లు రియల్‌ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
దీంతో ఈ ప్రాంతంలో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు ఈ ప్రాంతంలో భూములు, అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో అపార్ట్‌మెంట్లలో చ.అ. ధర రూ.4,500–5,000, గేటెడ్ కమ్యూనిటీలో అయితే రూ.5,500 నుంచి రూ.6,000లుగా ఉన్నాయి. ఓపెన్ ప్లాట్లయితే గజం రూ.60 వేల నుంచి రూ.80 వేలుగా పలుకుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉండనున్నాయి. ఇక నేషనల్ హైవే 44 ఉండడం కూడా ఈ ప్రాంతానికి కనెక్టివిటీ విషయంలో కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. అలాగే బొల్లారం, మేడ్చల్‌కు ఎంఎంటీఎస్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. సుచిత్ర నుంచి దూల పల్లి చౌరస్తా వరకు మధ్యలో మూడు ఎలివేటెడ్ కారిడార్ పనులు కూడా ప్రారంభమయ్యాయి.
శామీర్‌పేట్‌లో జీనోమ్ వ్యాలీ, నల్సర్ విశ్వవిద్యాలయంతో పాటు ఇంజనీరింగ్ కాలేజీలకు కూడా ఈ ప్రాంతం అడ్డాగా ఉండడంతో రియల్ ఎస్టేట్‌కి కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. కండ్లకోయలో 6 లక్షల చదరపు అడుగుల ఏరియాలో నిర్మించనున్న ఐటీ పార్క్ సైబర్ టవర్స్ కంటే ఎక్కువ స్థలంలో ఉండడం విశేషం. భవిష్యత్తులో ఈ ఐటీ పార్క్ ద్వారా 50 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో భవిష్యత్తుకు భరోసా ఉంటుందని నమ్మకం పెట్టుబడిదారులకు కలుగుతోంది. దీంతో ప్రధానంగా జీడిమెట్ల, దూలపల్లి, అల్వాల్, బొల్లారం, కొంపల్లి, కండ్లకోయ, శామీర్‌పేట, మేడ్చల్ వంటి ప్రాంతాలలో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..