దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్ నగర ప్రయాణికులకు కొత్త ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తెస్తోంది. తక్కువ టిక్కెట్ ధరతో.. ఎక్కువ దూరం తీసుకెళ్లే ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్యను పెంచుతోంది. నగర ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం తిరుగుతున్న ఎంఎంటీఎస్ రైళ్లకు బోగీలను పెంచే పని కూడా ప్రారంభించింది. ప్రస్తుతం 9 బోగీలతో తిరుగుతున్న ఎంఎంటీఎస్ రైళ్లు దశలవారీగా 12 బోగీలతో తిరిగేవిగా మారనున్నాయి. కొత్తగా 12 ఎంఎంటీఎస్ రైళ్లను సమకూర్చుకుంటున్న దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే 4 కొత్త రైళ్లను సిద్ధం చేసింది. ఆ నాలుగింటిలో రెండు రైళ్లు మే 1న నగర ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా వచ్చే రైళ్లలో అత్యాధునిక సౌకర్యాలు ఉండనున్నాయి. మహిళల కోసం కేటాయించిన బోగీల్లో సీసీటీవీలను ఏర్పాటు చేశారు. అత్యాధునిక సాంకేతికతతో బ్రేకింగ్ విధానం అభివృద్ది చేశారు.