Musi River: త్వరలోనే అఖిలపక్ష సమావేశం..! మూసీ పునరుజ్జీవంపై వెనక్కి తగ్గని తెలంగాణ ప్రభుత్వం

|

Oct 26, 2024 | 9:04 AM

తెలంగాణ ప్రభుత్వం మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దక్షిణ కొరియాలో నదుల పునరుజ్జీవనంపై అధ్యయనం చేసిన మంత్రుల బృందం తిరిగి వచ్చింది. ప్రతిపక్షాలు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నది పునరుజ్జీవనంతో ప్రజలకు నష్టం లేకుండా చూస్తామని హామీ ఇస్తున్న ప్రభుత్వం.. అఖిలపక్షాల నుంచి సలహాలు సూచనలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.. .

Musi River: త్వరలోనే అఖిలపక్ష సమావేశం..! మూసీ పునరుజ్జీవంపై వెనక్కి తగ్గని తెలంగాణ ప్రభుత్వం
Musi River Rejuvenation
Follow us on

మూసీపై తెలంగాణ మంత్రుల స్టడీ టూర్‌ ముగిసింది. దక్షిణ కొరియాలో నాలుగు రోజుల పాటు పర్యటించిన మినిస్టర్స్‌ టీమ్‌.. పలు అంశాలను క్షేత్రస్థాయిలో క్షుణంగా అధ్యయనం చేసింది. అటు ప్రతిపక్షాలు మాత్రం..ప్రత్యామ్నాయం తర్వాతే ప్రక్షాళన అని చెబుతున్నాయి. మూసీపైకి ఒక్క బుల్డోజర్ వచ్చినా ఊరుకునేదిలేదని హెచ్చరిస్తున్నాయి. మరినెక్ట్స్‌ ఏంటి..? మూసీపై రేవంత్‌ సర్కారు ఏ విధంగా ముందుకు వెళ్లనుంది..?

తెలంగాణ ప్రభుత్వం మూసీ పునరుజ్జీవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ వ్యవహారంలో ప్రతిపక్షాల నుండి ఎన్ని విమర్శలు ఎదురైనా తగ్గేదే లేదంటూ.. ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో నదుల పునరుజ్జీవంపై అధ్యయానికి దక్షిణ కొరియా వెళ్లింది..మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారుల బృందం. నాలుగు రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించిన బృందం..దేశరాజధాని సియోల్‌లో నదుల ప్రక్షాళనను పరిశీలించింది. అలాగే దక్షిణ కొరియాలో మురుగునీటి శుద్ధికరణపై అధ్యయనం చేసింది.

పరిశీలించిన మంత్రుల బృందం

ఒకప్పుడు కాలుష్యానికి గురై మురికి కూపంగా మారిన హన్‌ రివర్‌ని..అత్యద్భుతంగా పునరుద్దరించింది దక్షిణ కొరియా ప్రభుత్వం. మొత్తం 494 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నది… ఆ దేశ రాజధాని సియోల్‌ నగరంలో 40 కి.మీ. మేర ప్రవహిస్తోంది. ప్రక్షాళన అనంతరం శుభ్రంగా మారి ఇప్పుడు సియోల్‌ నగరానికి ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశం, జలవనరుగా అవతరించింది. దీంతో హన్‌ రివర్‌ను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు పరిశీలించారు. దక్షిణ కొరియా ప్రభుత్వం ఆ నదిని పునరుజ్జీవం చేసిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఎంఏపీఓల రిసోర్స్ ప్లాంట్, చియాన్గ్ జి చియాన్ రివర్, ఇన్చియాన్ ట్రీట్ మెంట్ ప్లాంట్, స్మార్ట్ సిటీ, స్పోర్ట్స్ సిటీలను కూడా సందర్శించారు.

మూసీ నివాసితులకు నష్టం వాటిల్లకుండా పునరుజ్జీవం

మూసీ నివాసితులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పునరుజ్జీవం చేస్తామంటోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా బాధితులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లతో పాటు రూ.2 లక్షల ఆర్థికసాయం కూడా అందిస్తున్నామని చెబుతోంది. అటు ప్రతిపక్షాలు మాత్రం.. మూసీపై పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెబుతున్నాయి. బీఆర్‌ఎస్‌, బీజేపీలతో పాటు ఎంఐఎం కూడా నిర్వాసితుల ఎజెండాతో ముందుకు వెళ్తున్నాయి. దీంతో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చే పనిలో పడింది ప్రభుత్వం. అందులో భాగంగా మూసీపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు మంత్రి పొన్నం ప్రభాకర్‌.. మూసీ పునరుజ్జీవాన్ని ప్రతిపక్షాలు గుడ్డిగా వ్యతిరేకించకుండా..సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. మరి అఖిలపక్షంపై ప్రతిపక్షాల వ్యూహం ఏ విధంగా ఉంటుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..