Ganesh Nimajjanam: హైదరాబాద్‌లో పిక్ పాకెటర్లు రెచ్చిపోయారు. దొరికిందో అదునుగా తమ చోర కళకు పని చెప్పారు. కేవలం ఒక్కో రోజులోనే ఏకంగా 1000 నుంచి 1200 సెల్‌ఫోన్‌లు మాయమయ్యాయి. ఇదంతా ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా జరిగిందనేగా. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన వినాయక నిమజ్జనం సమయంలో దొంగలు చెలరేగిపోయారు. గణనాథుల విగ్రహాల ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రజలు పెద్ద ఎత్తున వీక్షించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దొంగలు చాకచక్యంగా మొబైల్ ఫోన్‌లను కొట్టేశారు. ఓవైపు ప్రజలు నిమజ్జనం జోష్‌లో ఉంటే దొంగలు సైలెంట్‌గా తమ పని తాము చేసుకుపోయారు.
నిమజ్జనం రోజు మొబైల్ ఫోన్స్ కోల్పోయామని బాధితుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ఐఎంఈఐ నెంబర్ల ఆధారంగా సెర్చింగ్ మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లలో ఎక్కువ శాతం ఖైరతాబాద్ పరిధిలో జరిగాయి. ఈనెల 9న ఖైరతాబాద్ మహా గణపతి ఊరేగింపు సమయంలో తెలుగుతల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్‌కు లక్షలాది మంది చేరుకున్నారు.
గత శుక్ర, శనివారాల్లో సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 98 మంది బాధితులు తమ ఫోన్‌లను పోగొట్టుకున్నట్లు ఫిర్యాదులు చేశారు. ఇక హుస్సేస్ సాగర్ పరిసర ప్రాంతాల్లో శనివారం ఒక్కరోజే 400 నుంచి 500 ఫోన్‌లను పోయినట్లు ఫిర్యాదుల ఆధారంగా తెలుస్తోంది. వీటిలో కొన్ని ఫోన్‌లను కొందరు జాడవిరుచుకోగా, మరికొన్ని దొంగతనానికి గురయ్యాయి.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..