కేంద్రప్రభుత్వ వైఖరిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్(Minister Talasani Srinivas Yadav) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా లు దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్లిద్దరూ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండటం బీజేపీకి ఇష్టం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల వేళ మహారాష్ట్ర(Maharashtra) ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెట్టేసిందని మండిపడ్డారు. ఆరోగ్యం బాగాలేదని మహారాష్ట్ర గవర్నర్ ఆస్పత్రిలో చేరడం, హుటాహుటిన గోవా గవర్నర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించడం లాంటివి చూస్తుంటే మహారాష్ట్రలో జరుగుతున్న కుట్ర ఏంటో అర్థమవుతోందని చెప్పారు. సంప్రదాయాలు, సంస్కృతి గురించి మాట్లాడే ప్రధాని మోదీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి, అక్కడి ప్రభుత్వాలను హస్తగతం చేసుకున్నారని ఆరోపించారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారన్న మంత్రి తలసాని.. మహమ్మద్ ప్రవక్తపై ఆ పార్టీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, ప్రపంచం ముందు భారత్ తలదించుకునే పరిస్థితులు తీసుకొచ్చారని మండిపడ్డారు.
రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. జీవితకాలం బీజేపీ అధికారంలో ఉండదు. మహాత్మాగాంధీ అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తెస్తే కేంద్రంలోని బీజేపీ మాత్రం హింసావాదాన్ని ప్రోత్సహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు, విధానాలతో ప్రపంచం ముందు దేశం పరువు పోతోంది.
– తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ మంత్రి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి