Hyderabad: బోనాల పండుగలో గ్రూపు రాజకీయాలు సృష్టించొద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ పాతబస్తీ సుల్తాన్ షాహీ శ్రీ జగదాంబ అమ్మవారి దేవాలయం వద్ద ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీతో పాటు పాతబస్తీ పరిధిలో ఉన్న ఇతర దేవాలయాలకు బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వ తరఫున మంత్రి చెక్కులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘ప్రైవేటు దేవాలయాలకు సైతం ఆర్థిక సహాయం అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించింది’ అని తెలిపారు.
ఇక బోనాల పండుగలో గ్రూప్ రాజకీయాలు సృష్టించొద్దని తెలిపిన మంత్రి ఎవరైనా గొడవలకు దిగితే సహించేదిలేదని హెచ్చరించారు. పాతబస్తీలో ఏవైనా పనులు కావాలంటే తన దృష్టికి తేస్తే చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. బోనాల పండుగను విశ్వవ్యాప్తం చేయాలని, అనవసరంగా గొడవలు పడొద్దని సూచించారు.
కొందరు తమ వ్యక్తిగత గొడవలకు పండుగను వాడుకుంటున్నారని, లా అండ్ ఆర్డర్ విషయంలో తగ్గేది లేదని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి దేవదాయ శాఖ ఉన్నతాధికారులతో పాటు, భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాలు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..