Indiramma House: ఇందిరమ్మ ఇళ్లపై భారీ శుభవార్త అందించిన తెలంగాణ సర్కార్

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. అధికారంలోకి రాగానే ఇళ్ల నిర్మాణం చేపట్టింది. అయితే ఇందిరమ్మ ఇళ్లు ఎప్పుడెప్పుడు వస్తాయా అని దరఖాస్తు చేసుకున్న మరికొంతమంది ఎదురుచూస్తున్నారు. ఇలాంటివారికి మంత్రి పొంగులేటి గుడ్‌న్యూస్ అందించారు. ఆయన ఏమన్నారంటే..?

Indiramma House: ఇందిరమ్మ ఇళ్లపై భారీ శుభవార్త అందించిన తెలంగాణ సర్కార్
Indiramam Houses

Updated on: Dec 05, 2025 | 1:32 PM

Telangana News: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. దశలవారీగా రేవంత్ సర్కార్ ఇళ్లను మంజూరు చేయడంతో పాటు విడతల వారీగా లబ్దిదారుల అకౌంట్లలో నిధులు జమ చేస్తోంది. దీంతో పాటు ఇల్లుకు తక్కువ ధరలో ఇసుక, ఇటుక వంటివి అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల పూర్తైన కొన్ని ఇళ్లకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం కూడా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలమంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు పెట్టుకోగా.. ముందుగా ఇల్లు లేని పేదలకు ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో మిగతావారు తమకు ఎప్పుడు మంజురు అవుతుందా? అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం కీలక ప్రకటన చేశారు.

శుక్రవారం సచివాలయంలో పొంగులేటి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి శుభవార్త అందించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుందని తెలిపారు. త్వరలో లక్ష ఇళ్లకు గృహప్రవేశం చేస్తామని, వచ్చే ఏడాది మార్చి నాటికి 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టామని, త్వరలో అర్బన్ ప్రాంతాల్లో కూడా నిర్మాణాలు చేపడతామని ప్రకటించారు. గ్రౌండ్ ప్లస్ ఫోర్ బిల్డింగ్ విధానంలో ఇళ్లు నిర్మించి పేదలకు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఇక ఓఆర్‌ఆర్‌ను అనుకుని నలువైపులా ఉన్న స్థలాల్లో ఒక్కోచోట 10 వేల ఇల్లు నిర్మించి నో ప్రాఫిట్, నో లాస్ విధానంలో మధ్యతరగతి ప్రజలకు అందిస్తామన్నారు. త్వరలో అర్బన్ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించే విషయంపై దృష్టి పెడతామని, అందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు పొంగులేటి పేర్కొన్నారు.

ఇల్లు నిర్మించుకునేందుకు స్థలం లేని పేదలకు కూడా త్వరలోనే శుభవార్త అందుతుందని పొంగులేటి అన్నారు. అర్హులైన పేదలందరికీ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై పొంగులేటి విమర్శలు కురిపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో హౌసింగ్ శాఖ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని, వాళ్లు మధ్యలో వదిలేసిన ఇళ్లకు కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తింపచేస్తామన్నారు. ఒకే విడతలో ఇల్లు ఇచ్చి తాము చేతులు దులుపుకోమని, అర్హులైన వారందరికీ ఇల్లు నిర్మిస్తామన్నారు. అటు హిల్ట్ పాలసీపై కేటీఆర్ మాటలు అడ్డగోలుగా ఉన్నాయని, నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. వినూత్న నిర్ణయాలతో తాము ముందుకెళ్తున్నామని, కేసీఆర్ ప్రభుత్వంలా తాము చేయమని పొంగులేటి స్పష్టం చేశారు.