KTR – Taiwanese investments – Telangana: తెలంగాణలో తైవాన్ నుంచి భారీగా పెట్టుబడులు రానున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తైవాన్ పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఇన్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తైవాన్ – కనెక్ట్ తెలంగాణ స్టేట్ సమావేశంలో ప్రసంగించిన మంత్రి కేటీఆర్ ఈ మేరకు వెల్లడించారు. ఇన్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన తైవాన్ – కనెక్ట్ తెలంగాణ స్టేట్ సమావేశంలో మంత్రి. కే తారకరామారావు ఈ రోజు పాల్గొన్నారు. తైవాన్ మరియు తెలంగాణ మధ్య మరింత వ్యాపార వాణిజ్యన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో పెట్టుబడి అవకాశాలను కంపెనీలకు మరింత అవగాహన కల్పించే నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్రం తైవాన్ పెట్టుబడులకు ఆది నుంచీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపిన మంత్రి కేటీఆర్, ఇప్పటిదాకా తెలంగాణ – తైవాన్ మధ్య అద్భుతమైన భాగస్వామ్యం ఉందన్నారు. తైవాన్ పెట్టుబడుల కోసం ఆ దేశంలో పర్యటించిన ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తైవాన్ దేశానికి సంబంధించిన టి సి ఏ (taiwan computer association) తో టెక్నాలజీ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసిన విషయాన్ని మంత్రి చెప్పారు. ఇండియన్ తైవాన్ స్టార్టప్ అలయన్స్‌ని ఏర్పాటు చేసుకున్న ఏకైక భారత సిటీగా హైదరాబాద్ ఉందని కేటీఆర్ అన్నారు.
తైవాన్ పారిశ్రామిక సంస్కృతి నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సింది చాలా ఉందని, ఈ దిశగా అక్కడి పారిశ్రామిక వర్గాలతో మరింత భాగస్వామ్యం కోసం ప్రయత్నం చేస్తామని కేటీఆర్ అన్నారు. 2020 వ సంవత్సరం నుంచి వ్యాపార వాణిజ్య పరిస్థితులకు కరోన సంక్షోభం సవాళ్లను విసిరిందని, అయితే ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మెరుగు పడుతుందని నేపథ్యంలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ మరింత వేగంగా కొనసాగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం గత ఐదు సంవత్సరాలలో సాధించిన ప్రగతిని కేటీఆర్ క్లుప్తంగా వివరించారు.
ఇప్పటికే రాష్ట్రం సుమారు 32 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించిందని, తెలంగాణ జీడీపీ, తలసరి ఆదాయం పెరుగుతూ వస్తోందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో తెలంగాణ ఎప్పుడు అగ్రస్థానంలో నిలుస్తుందని తెలిపారు. ఐటి మరియు ఐటి అనుబంధ రంగాల్లో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ వస్తుందన్నారు. అయితే తమ రాష్ట్రం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు పరిశోధన అభివృద్ధి రంగాల్లో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుందని, ఈ దిశగా తైవాన్ కు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజాలను తెలంగాణలోకి ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉంటామని కేటీఆర్ తెలిపారు.
ప్రస్తుతం తైవాన్ కి చెందిన ప్రముఖ కంపెనీలు తెలంగాణలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ వంటి రంగాలకు మరింత ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ మరియు దాని అనుబంధ రంగాల్లో తైవాన్ తో బలమైన భాగస్వామ్యము కుదుర్చుకునేందుకు కృషి చేద్దామని కేటీఆర్ కోరారు. ఈ సమావేశం సందర్భంగా మాట్లాడిన ఇన్వెస్ట్ ఇండియా సీఈవో దీపక్ బగ్లా తెలంగాణ రాష్ట్ర పాలసీలు, రాష్ట్రం సాధిస్తున్న పురోగతి పైన ప్రశంసలు కురిపించారు. ఇన్వెస్ట్ ఇండియా తరఫున తెలంగాణ తో కలిసి పనిచేయడం ఎల్లప్పుడూ తమకు అత్యంత ప్రోత్సాహం ఇస్తుందని ఈ సందర్భంగా అన్నారు.
ఈ సమావేశంలో మాట్లాడిన టైట్రా (Taiwan External Trade Development Council) చైర్మన్ జేమ్స్ ఎఫ్ హువంగ్, తెలంగాణ తైవాన్ దేశానికి సహజ భాగస్వామి అని అన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి తాము అద్భుతమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే తైవాన్ కు చెందిన ప్రముఖ కంపెనీలు తెలంగాణతో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని, రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్స్ మరియు ఎలక్ట్రానిక్స్ అనుబంధ రంగాల్లో ఈ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ దిశగా ఈ రోజు ఇన్వెస్ట్ ఇండియా ఏర్పాటు చేసిన సమావేశం ఉపయుక్తంగా ఉంటుందని ఆశించారు. ఈరోజు జరిగిన ఈ వర్చువల్ సమావేశంలో మంత్రితో పాటు తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్ సుజయ్ కారంపూరి పాల్గొన్నారు.
Read also: Pawan Kalyan: గుంతలను పూడ్చితే బ్యారేజీకి నష్టం.. పవన్ కళ్యాణ్ శ్రమదానానికి అనుమతి నిరాకరణ