Cyber Frauds: బ్యాంక్‌లకు పోలీసుల అల్టిమేటం.. అదేంటంటే..

Cyber Frauds: ప్రస్తుతం ఆన్‌లైన్ మోసాలు, నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లు, ప్రీ-లాంచ్ ఆఫర్ల పేర్లతో ప్రజలు లక్షల్లో, కోట్లలో డబ్బులు కోల్పోతున్నారని అన్నారు. సైబర్ ఫ్రాడ్ వల్ల నష్టపోయిన కుటుంబాలు ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరవుతున్నాయన్నారు. దోపిడీలు, దొంగతనాల కంటే ఇప్పుడు సైబర్ మోసాలే..

Cyber Frauds: బ్యాంక్‌లకు పోలీసుల అల్టిమేటం.. అదేంటంటే..

Edited By: Subhash Goud

Updated on: Nov 30, 2025 | 4:58 PM

Cyber Frauds: సైబర్ మోసాలు పెరుగుతున్న తరుణంలో పలు బ్యాంక్ సిబ్బందితో సైబరాబాద్ పోలీసులు సమావేశం అయ్యారు. బ్యాంకులు–పోలీసుల మధ్య పనితీరు, స్పందన, సమాచార మార్పిడి మరింత వేగంగా, సమర్థవంతంగా ఉండేలా పలు చర్యల గురించి తెలియజేశారు. సైబర్ మోసాలు భారీగా పెరిగిపోయి ప్రజల జీవితాలను కుదిపేస్తున్నాయని బ్యాంకు అధికారులు, పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతీ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆన్‌లైన్ మోసాలు, నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లు, ప్రీ-లాంచ్ ఆఫర్ల పేర్లతో ప్రజలు లక్షల్లో, కోట్లలో డబ్బులు కోల్పోతున్నారని అన్నారు. సైబర్ ఫ్రాడ్ వల్ల నష్టపోయిన కుటుంబాలు ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరవుతున్నాయన్నారు. దోపిడీలు, దొంగతనాల కంటే ఇప్పుడు సైబర్ మోసాలే అత్యంత ప్రమాదకరమని, వీటి ప్రభావం ఏ రకమైన సంప్రదాయ నేరాల కంటే ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. సైబర్ మోసాల్లో పోయిన డబ్బు తిరిగి రాబట్టడానికి బ్యాంకుల వ్యవస్థలు, బలపడాలని, ముఖ్యంగా SBIతో సహా ప్రతి బ్యాంక్‌లో సెంట్రలైజ్డ్ సైబర్ సెల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఏ ఆఫర్‌లోనైనా పెట్టుబడి పెట్టేముందు ధృవీకరణ చేసుకోవాలని, ఏ అనుమానాస్పద కార్యకలాపం గమనించిన వెంటనే ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

బ్యాంకులు అధికారిక ఇమెయిళ్లకు సమయానికి స్పందించకపోవడం ప్రధాన సమస్యగా నిలిచిందనీ పోలీసులు అన్నారు. ఖాతా వివరాలు, KYC పత్రాలు, లావాదేవీ డేటా వంటి కీలక సమాచారాన్ని ఆలస్యం చేసి పంపడం వలన దర్యాప్తు గాడి తప్పుతోందని భావించారు. ఖాతాలు నిలిచిపోవడం, వాటిని అమలు చేయడంలో ఆలస్యం, వాటి స్టేటస్‌ను ధృవీకరించడంలో జాప్యం, అలాగే డీఫ్రీజ్ అభర్థనల ప్రాసెసింగ్‌లో అనవసరమైన తగ్గదడను పోలీసులు ప్రశ్నించారు. ఒకసారి ఖాతా నిలిచిపోయిన తర్వాత ఎలాంటి డెబిట్ లావాదేవీ జరగకూడదని, అలాంటిది జరిగితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని తెలిపారు.

ఖాతాల స్టేట్‌మెంట్లు తప్పనిసరిగా ఎక్సెల్ ఫార్మాట్‌లో ఇవ్వాలని, నేరేషన్, ట్రాన్సాక్షన్ ఐడీ, డెబిట్/క్రెడిట్ వివరాలు, రన్నింగ్ బ్యాలెన్స్ వంటి అన్ని అంశాలు ఉండాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారుల పేర్లు బ్యాంకు రికార్డులతో ఖచ్చితంగా పొంతన కలిగి ఉండాలని, వ్యత్యాసాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనేక ఫ్రీజ్ ఆర్డర్‌లు ఒకేసారి అమల్లో ఉన్నప్పుడు బ్యాంకులు సమన్వయం మెరుగుపరచాలని, అనుమానాస్పద లావాదేవీలను వెంటనే ఫ్లాగ్ చేయాలని, మ్యూల్ ఖాతాలను అరికట్టేందుకు KYC వ్యవస్థను కఠినతరం చేయాలని అన్నారు.

ప్రతి బ్యాంకులో ప్రత్యేక Cyber-Crime Response Desk ఏర్పాటు చేయాలని, నోడల్ అధికారుల తాజా కాంటాక్ట్ వివరాలు అలాగే బ్యాకప్ సిబ్బందికి సంబంధించిన వివరాలు తప్పనిసరిగా ఉంచాలని ఆదేశించారు. ఫ్రీజ్/డీఫ్రీజ్ అభ్యర్థనలు, స్టేట్‌మెంట్లు, KYC అభ్యర్థనలు 1–3 రోజుల్లో తప్పనిసరిగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. బ్రాంచ్ సిబ్బందికి సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్‌పై ప్రత్యేక శిక్షణ అవసరమని, ముఖ్యంగా కార్పొరేట్ అకౌంట్లకు సంబంధించిన రిలేషన్‌షిప్ మేనేజర్ వివరాలు పోలీసులు అందుకునేలా సమన్వయం చేయాలని సూచించారు.

పోలీసు సిబ్బంది–బ్యాంకుల మధ్య సహకారం వల్లే సైబర్ క్రైమ్‌లను సమర్థవంతంగా అరికట్టగలమని హితవు పలికారు. బ్యాంకుల స్పందన వేగవంతమైతేనే బాధితుల డబ్బు రికవరీ త్వరగా జరిగి, ఆర్థిక నష్టాలు తగ్గుతాయని అన్నారు. ఈ చర్యలను ఖచ్చితంగా అమలు చేస్తే సైబర్ నేరాల దర్యాప్తు వేగవంతమవుతుందని, బ్యాంకింగ్ వ్యవస్థ విశ్వసనీయత మరింత బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి