హైదరాబాద్, డిసెంబర్ 13: అనుమానం నిండు కుటుంబాన్ని బలితీసుకుంది. ఆవేశంలో భార్య గొంతు కోసి, కుమారుడి గొంతు నులిమి హత్య చేశాడు. భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం ఈ దారుణానికి దారి తీసింది. అనంతరం తానూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చివరకు ఐదేండ్ల చిన్నారిని అనాథగా మారింది. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్‌లోని బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో చోటు చేసుకుంది. అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్, బేగంబజార్ ఇన్‌స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ఫిరోదాబాద్‌కు చెందిన ఎండీ సిరాజ్ అలీ (40) కుటుంబంతో సహా ఏడేళ్ల క్రితం బతుకు దెరువు కోసం హైదరాబాద్‌కి వచ్చాడు. ఎండీ సిరాజ్ అలీకి హేలియాతో 2017లో వివాహమైంది. ఇక్కడ బేగంబజార్ తోప్‌ఖానా ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో ఉంటూ గాజుల దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరికి అలీజాన్ (5), హైజాన్ (2) ఇద్దరు పిల్లలు. భార్యా పిల్లలు ఉత్తర్‌ప్రదేశ్‌లోని సొంత గ్రామంలో ఉంచి నగరంలో పనిచేసి రెండేళ్ల కోసారి ఊరికి వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో ఈ యేడాది నవంబర్‌లో ఊరికి వెళ్లిన సిరాజ్ డిసెంబర్ 10న తన భార్య, పిల్లలను నగరానికి తీసుకొచ్చి తనతోపాటే అద్దె ఇంట్లో కాపురం ఉన్నాడు. అయితే సిరాజ్‌కు భార్య ప్రవర్తనపై అనుమానం కలిగింది. వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం ఉందంటూ నిత్యం గొడవపడేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి భార్యతో మరోమారు గొడవపడ్డాడు. గొడవ ముదరడంతో సిరాజ్ ఉన్మాదిగా మారి శుక్రవారం ఉదయం 3 గంటల సమయంలో భార్య హేలియాను కత్తితో గొంతు కోసి చంపాడు. తన రెండేళ్ల కుమారుడు హైజాన్‌ను కూడా గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం హిందీలో సూసైడ్ నోట్ రాసి అతను కూడా ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్యహత్య చేసుకున్నాడు.
తెల్లవారు జామున 4 గంటల సమయంలో నిద్ర లేచిన పెద్ద కుమారుడు అలీజాన్ తల్లి హేలియా రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి తీవ్రంగా ఏడుస్తూ ఇరుగు పొరుగును నిద్రలేపాడు. స్థానికులు అక్కడికి చేరుకునే సరికి సిరాజ్, హేలియా, వీరి రెండేళ్ల కుమారుడు విగతజీవులుగా కనిపించారు. వెంటనే 100కు కాల్ చేసి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు సూసైడ్ నోట్ ద్వారా పోలీసులు గ్రహించారు. తాము చనిపోయిన అనంతరం తమ మృతదేహాలను స్వస్థలానికి తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు తెలిపాలని సిరాజ్ అందులో రాశాడు. దీంతో పోలీసులు సిరాజ్, హేలియా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం సిరాజ్ సోదరుడికి మృతదేహాలను అప్పగించారు. అనంతరం మృతదేహాలను ఉత్తర్‌ప్రదేశ్‌లోని స్వస్థలానికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు.