భాగ్యనగరంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆదివారాన బోనాలు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. వందేళ్లకు పైగా చరిత్ర కల్గిన లాల్‌దర్వాజా బోనాలు వస్తున్నాయంటే.. తెలంగాణ ప్రజలు మాత్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. 1908లో వచ్చిన వరదల సమయంలో నిజాం రాజులు అమ్మవారికి మొక్కులు చెల్లించడంతో వరదలు తగ్గాయని.. అప్పటి నుంచి ప్రతి ఏడాది బోనాల పండుగను నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు ఆలయ నిర్వాహకులు. ఆషాడ మాసంలో చివరి వారం జరిపే ఈ బోనాల సందడి పాతబస్తీలో రెండు రోజుల పాటు సాగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు మహిళలకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో పాటు ఎటువంటి భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు.