దివంగత ప్రొఫెసర్ కె. జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తుండగా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ సంఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో స్పందించారు.
ఈ ఘటన శేరిగిలింగంపల్లి ఆల్విన్ కాలనీలో చోటు చేసుకుంది. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియోలో ఓ వ్యక్తి విగ్రహంపై రాయి విసురుతున్నట్లు స్పష్టం కనిపిస్తోంది. అయితే సదరు వ్యక్తి ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే ఈ సంఘటన జరుగుతున్న సమయంలో అక్కడ ఒక పోలీస్ ఆఫీస్ ఉండడం గమనార్హం, పోలీసు ఉన్న సమయంలో ఇలాంటి ఘటన జరగడం ఏంటని కూడా నెట్టింట పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహంపై దాడి సంఘటనను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్ దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై కేటీఆర్ ట్వీట్ చేస్తూ.. ‘ఈ హేయమైన చర్యకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని డిమాండ్ చేస్తున్నాను. తెలంగాణ ప్రజానికం ఎంతగానో గౌరవించే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దారుణమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చారు.
Demand @TelanganaDGP to take stern action on the perpetrator of this heinous act
Strongly condemn the atrocious act of destruction of the statue of Prof. Jayashankar Garu who is widely regarded and respected in Telangana https://t.co/mvkuBHOyxj
— KTR (@KTRBRS) January 16, 2024
ఇదిలా ఉంటే ప్రొఫెసర్ కొత్తపలి జయశంకర్‌కు తెలంగాణ చరిత్రలో ఉన్న ప్రాముఖ్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ ఏర్పాటులో జయశంకర్ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలో సిద్ధాంతకర్తగా వ్యవహరించారు. మాజీ సీఎం కేసీఆర్ సైతం ఉద్యమ సమయంలో జయశంకర్ సలహాలు, సూచనలు తీసుకున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..