తెలుగు రాష్ట్రాల సీఎంలు నిన్న ప్రగతి భవన్‌లో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారు పలు కీలక అంశాలపై చర్చించారు. అందులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు పూర్తిగా సహకరిస్తామని కేసీఆర్ ప్రకటించారు. దానిపై తాము వేసిన కేసులను ఉపసంహరించుకుంటామని ఆయన తెలిపారు. ప్రాజెక్టు నిరాటంకంగా కొనసాగేందుకు అన్ని విధాల సహకారం అందిస్తామని.. కావాలంటే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో సంప్రదింపులు కూడా జరుపుతామని ఆయన అన్నారు.
కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వైఎస్ జగన్ స్వాగతించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన జగన్.. ‘ఉద్యమ సమయంలో పోలవరంను వ్యతిరేకించిన కేసీఆర్ ఇప్పుడు మనసు మార్చుకున్నందుకు ధన్యవాదాలు’ అని అన్నారు. ఇరు రాష్ట్రాలు ఇలా చెలిమితో కొనసాగితే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.