
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపొందారు. రెండోస్థానంలో బీఆర్ఎస్ నిలిచింది. మూడో స్థానంలో నిలిచిన బీజేపీకి డిపాజిట్ గల్లంతైంది. మొత్తంగా లెక్కించిన 1,94,631 ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 98,945, BRS అభ్యర్థి 74,234 ఓట్లు రాగా.. BJP అభ్యర్థి(17,041) డిపాజిట్ కోల్పోయారు.
మొదటి మూడు స్థానాల్లో ఈ మూడు పార్టీలు నిలిచాయి. మరి నాలుగో స్థానం ఎవరిది ? 58 మంది పోటీ చేసిన ఈ ఉప ఎన్నికల్లో నాలుగో స్థానంలో నిలిచిన అభ్యర్థి ఎవరు ? ఏ పార్టీకి చెందిన అభ్యర్థి ఈ స్థానంలో నిలిచారనే విషయం ఆసక్తి కలిగించే అంశం. అయితే ఇంతటి ఉత్కంఠభరితమైన ఈ ఉప ఎన్నికల్లో నాలుగో స్థానం ఎవరూ ఊహించని గుర్తుకు దక్కింది. అవును.. మీరు విన్నది నిజమే. ఈ ఉప ఎన్నికల్లో నాలుగో స్థానం దక్కించుకుంది మరేదో కాదు. మాకు వీళ్లెవరూ నచ్చలేదని చెప్పే నోటా గుర్తు.
సాధారణంగా నోటాకు పెద్దగా ఓట్లు రావు. అందులోనూ తక్కువ శాతం ఓట్లు పోలయ్యే చోట.. నోటాకు వచ్చే ఓట్ల సంఖ్య కూడా తక్కువగానే ఉంటుంది. కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. నోటా గుర్తుపై ఏకంగా 924 మీట నొక్కారు. అంటే 924 మంది ఓటర్లు తమకు ఏ ఒక్క అభ్యర్థి నచ్చలేదని తేల్చిచెప్పారు. జూబ్లీహిల్స్ లాంటి ఉత్కంఠభరితమైన ఉప ఎన్నికల్లో నోటాకు ఈ స్థాయిలో ఓట్లు రావడం నిజంగా విశేషమే.