Hyderabad: అతను చేసేది ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగం. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందరి ముందు మంచివాడిలా నటిస్తాడు. అలా మంచితనం మాటున ఓ అమ్మాయిని ట్రాప్ చేశాడు. చివరికి తనను పెళ్లి చేసుకోవాలంటూ యువతిని వేధించసాగాడు. అతని వేధింపుల కారణంగా యువతికి నిశ్చయమైన పెళ్లి క్యాన్సిల్ అవడమే కాకుండా.. యువతి తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలోని పరిగిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వ అసుపత్రిలో సినియర్ అసిస్టెంట్‌గా వెంకటేశ్ (48)అనే వ్యక్తి విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, అతని ఇంటి పక్కనే నివాసముంటున్న యువతిపై వెంకటేశ్ కన్ను పడింది. ఆ అమ్మాయితో రోజూ మాట్లాడి.. చివరికి తన ట్రాప్‌లోకి దింపాడు. అలా కొంతకాలం యువతితో సన్నిహితంగా ఉన్న వెంకటేశ్ ఇప్పుడు తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడు. ఆ అమ్మాయికి ఎస్జిటి ఉద్యోగం వచ్చింది. ఈ క్రమంలో ఆ యువతికి పెళ్లి నిశ్చయం అయ్యింది. డిసెంబర్‌లో నిశ్చితార్థం అవగా.. మే 17న పెళ్లి పెట్టుకున్నారు. అయితే, ఇది తెలుసుకున్న వెంకటేశ్.. మరింత రెచ్చిపోయి యువతిని వేధించసాగాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ యువతి వెంట పడుతున్నాడు.
చివరికి యువతి పని చేసే స్కూల్ వద్దకు వచ్చి కూడా రభస సృష్టించాడు. పలు మార్లు పెద్దలు అతన్ని మందలించినా వినకుండా ఆమె వెంటపడుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో యువతిని పెళ్లి చేసుకునే యువకుడిని ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు వెంకటేశ్. అతను పెట్టిన టార్చర్‌తో యువతికి నిశ్చయమైన పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యింది. దాంతో యువతి తీవ్రమైన డిప్రెషన్‌కు లోనైంది. యువతి పరిస్థితి మరింత దారుణంగా మారడంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వెంకటేశ్ వేధింపులు శృతిమించుతుండటంతో చివరికి పరిగి పోలీసులను ఆశ్రయించారు బాధితులు. వెంకటేశ్ తమ కూతురును టార్చర్ చేస్తున్నాడని, అతని వేధింపులతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందని అమ్మాయి తల్లిదండ్రులు పోలీసుల ముందు వాపోయారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
‘ మా నాన్నను వదిలేయండి’.. కంటతడి పెట్టుకున్న జవాను రాకేశ్వర్ సింగ్ కుమార్తె.. కదిలిస్తున్న వీడియో