
హైదరాబాద్‌కు చెందిన ఒక యువతి ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తి చేతిలో లైంగిక వేధింపులకు, ఆర్థిక దోపిడీకి గురైంది. ఆమె ఫిర్యాదు ఆధారంగా, చిల్కల్‌గూడ పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడు, నాగోల్ నివాసి అయిన 34 ఏళ్ల కొర్రా రాజా అలియాస్ కొర్రా రాజ్ చౌహాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. మాయమాటలతో నమ్మించి బాధితురాలిని లైంగికంగా లోబరుచుకున్నట్లు నిందితుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. బాధితురాలు ఏప్రిల్ 1న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
చిల్కలగూడ పోలీస్ స్టేషన్ SHO బి. అనుదీప్ మాట్లాడుతూ.. నిందితుడు మ్యాట్రిమోనియల్ యాప్ ద్వారా యువతిని సంప్రదించాడని, ఆమె నమ్మకాన్ని సంపాదించడానికి మూడు నెలలపాటు మాయ మాటలు చెప్పినట్లు గుర్తించారు. ఆమెతో ఎమోషనల్ బాండింగ్ ఏర్పరచుకున్న తర్వాత, పలుమార్లు ఆమెపై లైంగిక దాడి చేశాడు. తరువాత ఆమె సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించి ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. రూ. 1.5 లక్షలు బలవంతంగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. కొర్రా రాజాకు ఆల్రెడీ మ్యారేజ్ అయినట్లు పోలీసుల విచారణలో బయటపడింది.
అతను మహిళలను ట్రాప్ చేసేందుకు మ్యాట్రిమోనియల్ సైట్లలో అనేక నకిలీ ప్రొఫైల్‌లను సృష్టించాడని పోలీసులు చెబుతున్నారు. బాధితులను ఆర్థికంగా, మానసికంగా దోపిడీ చేసేవాడని వెల్లడించారు. విచారణలో, నిందితుడు వివాహ యాప్‌ల ద్వారా చాలామంది మహిళలను వేధించినట్లు అంగీకరించాడు. పోలీసులు మ్యాట్రిమోనియల్ యాప్ నుంచి చాట్ రికార్డులు, బ్యాంక్ లావాదేవీ రుజువులు, ఇతర డిజిటల్ ఆధారాలతో సహా బలమైన ఆధారాలను సేకరించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..