మహా నగరానికి మరో అద్భుత ప్రాజెక్ట్ రానుంది. గ్రేటర్‌లో ఉన్న లక్షలాది మంది గొంతు తడిపే వినూత్న ప్రాజెక్ట్‌కు హైదరాబాద్ జలమండలి శ్రీకారం చుట్టనుంది. నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేదే ఔటర్ రింగ్ మణిహారం.. ఇప్పుడు ఈ మణిహారానికి తోడు భాగ్యనగర సిగలో మరో జలహారం సొబగులు అద్దుకోబోతోంది. ట్రాఫిక్ సమస్యలకు ఔటర్ మణిహారం చెక్ పెడితే.. నగరంలో నీటి సమస్యలకు చెక్ పేట్టేందుకు ఈ జలహారం రూపు దిద్దుకుంటుంది. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 158 కిలోమీటర్ల మేర భారీ పైప్ లైన్లు.. రిజర్వాయర్లు నిర్మించి వాటి ద్వారా నగరంలోకి నీరు సప్లై చేయనుంది హైదరాబాద్ జలమండలి.
ప్రస్తుతం కృష్ణ గోదావరి సింగూరు మంజీరా ప్రాజెక్టుల నుంచి రోజూ దాదాపు 2000 మిలియన్ లీటర్ల నీరు నగరంలోకి సప్లై అవుతోంది. అయినప్పటికీ ప్రతి రోజూ అందరికీ తగినంత నీళ్లు ఇవ్వలేని పరిస్థితి. దానికి కారణం.. నగరంలో అంతకంతకూ పెరుగుతున్న జనాభా. తగ్గిపోతున్న నీటివనరులు. ఈ నీటి కష్టాలకు చెక్ పెట్టేలా.. 2050 నాటికి పెరిగే గ్రేటర్ జనాభాను దృష్టిలో ఉంచుకుని ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది హైదరాబాద్ జలమండలి. ప్రస్తుతం నగరానికి నీటి సరఫరా చేస్తున్న ఏదైనా ప్రాజెక్టుకు నీటి కొరత ఏర్పడితే.. ఆ సమస్యకు చెక్ పెట్టేందుకే ఈ భారీ రింగ్ మెయిన్ ప్రాజెక్టును చేపడుతున్నారు అధికారులు.
అసలేంటీ ప్రాజెక్ట్? ఎలా డిజైన్ చేయబోతున్నారు? ఖర్చు ఎంతనేది చూద్దామిప్పుడు. ఓఆర్‌ఆర్ చుట్టూ 12 భారీ స్టోరేజ్ రిజర్వాయర్లను నిర్మించనున్నారు. వీటి నిల్వ సామర్థ్యం 120 మిలియన్ లీటర్లు ఉంటుంది. 615 కి.మీ. మేర నీటి పంపిణీ పైప్‌లైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.5,376 కోట్లు. ఓఆర్‌ఆర్ చుట్టూ 3 మీటర్ల వ్యాసార్థంతో భారీ పైప్‌లైన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ పైప్‌లైన్ కోసం ఏకంగా రూ. 550 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఓఆర్‌ఆర్ లోపల 18 చోట్ల రేడియల్ మెయిన్ పైప్‌లైన్లను నిర్మిస్తారు. రేడియల్ పైప్‌లైన్ కోసం రూ.250 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ఈ ప్రాజెక్ట్‌తో నగరంలో 24గంటలు నీటి సరఫరాకు అవకాశం ఉంటుంది. నగరమంతటా కృష్ణా, గోదావరి, మంజీరా, సింగూరు జలాలు విస్తరిస్తారు. ఏటా 20 టీఎంసీల నీటిని తరలించవచ్చు. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే నగరంలో 24 గంటల వాటర్ సప్లై ఇవ్వొచ్చని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..