
Hyderabad: సాధారణంగా నగరంలో పార్కింగ్ స్థలాలు ఉంటాయి. వాటిలో బైక్ గానీ, కారు గానీ పార్కింగ్ చేసినప్పుడు వాహనదారుడు మళ్లీ తీసుకునే వరకు ఆ పార్కింగ్ యజమానిదే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓ పబ్‌లో కారు చోరీ ఘటనపై స్పష్టత ఇచ్చింది హైదరాబాద్ జిల్లా కమిషన్. వాలెట్ పార్కింగ్‌లో బీఎండబ్ల్యూ కారు చోరీ అయిన ఘటనలో పబ్ యాజమాన్యానికి హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-3 పెనాల్టీ విధించింది. వాహనాలకు పార్కింగ్ సదుపాయం కల్పించినప్పుడు వాహనానికి ఏదైనా జరిగినా లేదా చోరీ జరిగినా పూర్తి బాధ్యత సంస్థ యాజమాన్యానిదేనని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: LPG Price: ఆగస్టు 1 నుంచి గ్యాస్ సిలిండర్ల ధరలు మారనున్నాయా? పెరుగుతాయా? తగ్గుతాయా?
గండిపేట మండలం మంచిరేవులకు చెందిన వ్యాపారవేత్త వి.రాజశేఖర్‌రెడ్డికి బీఎండబ్ల్యూ ఎక్స్5 కారు ఉంది. 2022 మే 7వ తేదీన రాత్రి ఆయన కుమారుడు రేవంత్ తన స్నేహితులతో కలిసి నానక్‌రామ్‌గూడలోని పబ్ ‘జీరో 40 బ్రూయింగ్’కు వెళ్లారు. అయితే కారు పార్క్ చేసిన తర్వాత సిబ్బందికి వాహనం తాళం ఇవ్వగా వాలెట్ పార్కింగ్ ట్యాగ్ ఇచ్చారు. పార్టీ పూర్తయ్యేసరికి కారు చోరీకి గురైందని తేలడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు సదరు కారు యజమాని. ఈ చోరీ ఘటనపై పోలీసులు సుదీర్ఘ గాలింపు తర్వాత 2023 ఆగస్టు 21న కారును రికవరీ చేసి యజమానికి అప్పగించారు.
తర్వాత యజమాని కారును రిపేరు చేయించుకుని వినియోగించుకున్నాడు. అయితే తన కారు చోరీ గురైన తర్వాత తీవ్ర మానిసిక వేదనకు లోనయ్యాయని, సదరు కారు యజమాని కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు. కారు చోరీ విషయంలో పబ్ యాజమాన్యం తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఈ విషయంలో కమిషన్ అధ్యక్షుడు ఎం.రామ్‌గోపాల్‌రెడ్డి, సభ్యులు జె.శ్యామల, డి.మాధవీలతతో కూడిన బెంచ్.. ఇది సేవాలోపం కిందకే వస్తుందని స్పష్టం చేసింది. పబ్ మాతృసంస్థలైన ‘బాంబే డక్ డైనింగ్ కంపెనీ’, ‘రెవల్యూషన్ క్రాఫ్ట్‌బ్రూస్’ యాజమాన్యాలకు జరిమానా విధించింది.
ఇక కారు చోరీకి గురైన తర్వాత బాధ్యత వహించని పబ్ యాజమాన్యంపై కారు మరమ్మతు ఖర్చులు రూ.2,08,937ను 9శాతం వడ్డీతో, వినియోగదారుడికి కలిగించిన అసౌకర్యం, అలాగే మానసిక వేదనకు రూ.50 వేల పరిహారం, కేసు ఖర్చుల కింద రూ.10 వేలు చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Minimum Balance: ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయలేదా?.. పెనాల్టీల రూపంలో బ్యాంకులు భారీగా వసూళ్లు..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి