హైదరాబాద్, ఆగస్టు 27: ఏ పోలీస్ స్టేషన్‌కి వెళ్లినా అక్కడ కొన్ని బైకులు, కార్లు, ఆటోలు లాంటివి పార్క్ చేసి ఉంటాయి. వాటన్నింటిని ఓ పెద్ద గొలుసుతో కట్టి తాళం కూడా వేసి ఉండడాన్ని గమనించే ఉంటారు. ఇలా ప్రతి పోలీస్ స్టేషన్ ముందు ఇలాంటి వాహనాల ఎన్నో కనిపిస్తాయి. అవి కొన్ని ఏళ్ల తరబడి అక్కడే వదిలేసిన వాహనాలు. వివిధ కారణాలతో పోలీసులు సీజ్ చేసిన వాహనాలు అవన్నీ కూడా. సాధారణంగా ఏదైనా ఒక కేసులో వాహనాన్ని సీజ్ చేసినప్పుడు కొన్ని వాహనాలను విడిపించుకుంటారు. అలా సీజైన వాహనాల్లో మరి కొన్ని ఏళ్ల తరబడి పలు కేసుల కారణంగా పోలీస్ స్టేషన్‌లోనే ఉండిపోతాయి. ఇంకా సంవత్సరాల తరబడి అవి నిరుపయోగంగా ఉండటంతో రోడ్డుపై నడపటానికి వీలు కానీ విధంగా మారుతాయి. అవి స్క్రాప్‌కు తప్ప ఏ విధంగా పనికిరావు. అలాంటి వాహనాలనే పోలీసు అధికారులు వేలం ద్వారా అమ్ముతుంటారు.
అయితే అందులో ఏ వాహనాలు స్క్రాప్.. ఏయే వాహనాలు రోడ్డు మీద నడిపేందుకు అనువుగా ఉన్నాయనేది ఆర్‌టీఏ అధికారులు ఇన్స్పెక్షన్ చేసి నిర్ణయిస్తారు. ప్రభుత్వం వాటిని బహిరంగంగా వేలం వేస్తోంది. అదేదో స్క్రాప్‌యే కదా అని కొట్టి పారేయకండి. ఆ స్క్రాప్ వెహికిల్స్ అమ్మటం ద్వారానే ప్రభుత్వం కోట్ల రూపాయల ఆదాయాన్ని గడిస్తుందంటే నమ్మగలరా..? నమ్మశక్యంగా లేకున్నా ఇది అక్షరాల సత్యం. రీసెంట్‌గా తుప్పు పట్టిన వాహనాలను హైదరాబాద్ గోషామహల్‌లో వేలం వేయడం ద్వారా వచ్చిన ఆదాయం 90 లక్షలపై మొత్తంలోనే. అలాగే హైదరాబాద్ కమిషనరేట్‌లోని సీజ్ చేసిన వాహనాలు అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయం ఒక్క సారికే సుమారు కోటి రూపాయలు. ఒక్కసారికే సుమారు కోటి ఆదాయం అంటే అలా తుప్పు పట్టిన వాహనాల ద్వారా మొత్తం ఎంత ఆదాయం వచ్చిందో ఊహించుకోవచ్చు.
ఒక వాహనం సీజ్ చేసినప్పుడు సుమారు నాలుగైదు ఏళ్ల వరకు దాన్ని ఎవరు విడిపించుకోకుంటే వాటి గురించి ముందుగా పేపర్లో యాడ్ ఇస్తారు. ప్రభుత్వం వేలం వేయదలుచుకున్న వాహనాల్లో మీ వాహనం ఉందంటే సంబంధిత పత్రాలతో పోలీస్ స్టేషన్‌కి చేరుకొని ఆధారాలు చూపించి వాహనం తీసుకోవాలని ప్రకటన ఇస్తారు. అలా ప్రకటన ఇచ్చినప్పటి నుంచి సుమారు 6 నెలల గడువు లోపు వాహనాల యజమాని తమ వాహనాలను తీసుకోవాల్సి ఉంటుంది. అలా రాకుంటే 6 నెలల తర్వాత ఆ వాహనాలను ఎప్పుడు ఎక్కడ వేలం వేస్తున్నారో, ఎన్ని వాహనాలు ఉన్నాయో అనే వివరాలతో మరో ప్రకటన చేస్తారు. ఆర్టీఏ అధికారులు ఇచ్చిన సర్టిఫికెట్ ఆధారంగా ఏయే వాహనానికి ఎంత ధర అనేది నిర్ణయించి వేలం పాట పాడుతారు.
ఇక ఈ వేలం పాటలో ఎవరైనా పాల్గొనవచ్చు, ఎటువంటి రుసుము ఉండదు సాధారణంగా సెకండ్ హ్యాండ్ వాహనాలను డిలీట్ చేసేవాళ్లు, ఆటోమొబైల్ డీలర్లు, మెకానిక్‌లు వేలం పాటలో పాల్గొంటారు. స్క్రాప్ వాహనాలను అమ్ముకుంటే మీద నడపటానికి అనువైన వాహనాలను కొలువును చేసిన వాళ్లు ఆర్టిఏ అధికారుల దగ్గరికి వెళ్లి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందిన తర్వాత మరల ఆ వాహనాలని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కొత్త రిజిస్ట్రేషన్ నెంబర్‌ని కేటాయిస్తారు. ఏళ్ళ తరబడి వాహనాలు అలాగే వదిలేసి ఉంటాయి కాబట్టి 90 శాతం వరకు వాహనాలు స్క్రాప్‌కు తప్ప దేనికి పనికిరావు. ఈ క్రమంలోనే మొన్న హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గోషామహల్‌లో సుమారు 1600 వాహనాలను వేలం వెయ్యగా అటు ఇటుగా కోటి ఆదాయం గడించారు.
వాటి గురించి చెప్పాలంటే.. హైదరాబాద్ సిటీ పోలీసులు గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌లో 1641 వాహనాలను 17వ దశ బహిరంగ వేలం వేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుండి దాదాపు 550 మంది బిడ్డర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో హైదరాబాద్ సిటీకి చెందిన 1598 క్లెయిమ్ చేయని స్క్రాప్ వాహనాలు (1561 ద్విచక్ర వాహనాలు, 25 త్రీ వీలర్లు, ఇంకా 12 ఫోర్ వీలర్ వాహనాలు) రూ.83 లక్షలకి అమ్ముడయ్యాయి. అలాగే రోడ్ కండిషన్ ఉన్న 43 ద్విచక్ర వాహనాలను వేలం వేయగా రూ. 9,70,000/, మిగిలిన 1641 వాహనాలు విక్రయించగా వేలంలో వచ్చిన మొత్తం రూ. 92,70,000 అందింది.