AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌‌లో నైట్‌ షిఫ్ట్‌.. మన నగరం ఎంత వరకు సేఫ్..

హైదరాబాద్‌లో రాత్రి షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగుల కోసం నైట్‌ బస్‌ సర్వీసులు మళ్లీ తెరపైకి వచ్చాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆరు ప్రధాన మార్గాల్లో తొలి దశలో 15 బస్సులు నడిపే ప్రణాళిక ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నైట్‌ బస్సులు అందుబాటులోకి రావడం మాత్రమే నైట్‌ సేఫ్టీకి పరిష్కారం కాదు.

Hyderabad: హైదరాబాద్‌‌లో నైట్‌ షిఫ్ట్‌.. మన నగరం ఎంత వరకు సేఫ్..
Hyderabad Night Safety
Siva Nagaraju
| Edited By: |

Updated on: Aug 31, 2026 | 12:45 PM

Share

హైదరాబాద్‌ ఇప్పుడు పగలు మాత్రమే పనిచేసే నగరం కాదు. రాత్రి కూడా పరుగులు తీస్తున్న నగరం.. ఐటీ, బీపీవో, ఆస్పత్రులు, హోటళ్లు, ఎయిర్‌పోర్ట్‌, డెలివరీ, సెక్యూరిటీ వంటి రంగాల్లో వేలమంది రాత్రి షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. ముఖ్యంగా హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతాల్లో రాత్రి 10 గంటల తర్వాత కూడా ఆఫీసుల నుంచి ఉద్యోగులు బయటకు వస్తూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో నైట్‌ బస్‌ సర్వీసులు మళ్లీ తెరపైకి వచ్చాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆరు ప్రధాన మార్గాల్లో బస్సులు నడిపే ప్రణాళిక ఉంది. తొలి దశలో 15 బస్సులతో ప్రారంభించి స్పందనను బట్టి సర్వీసులు పెంచే అవకాశం ఉంది.

నైట్‌ బస్‌ వస్తేనే నైట్‌ సేఫ్టీ వచ్చినట్టా?

హైదరాబాద్‌లో నైట్‌ షిఫ్ట్‌ ఉద్యోగులపై నగరవ్యాప్తంగా ఖచ్చితమైన అధికారిక లెక్క ప్రస్తుతం లేదు. ఐటీ, ఐటీఈఎస్‌, బీపీవో, హెల్త్‌కేర్‌, హాస్పిటాలిటీ, డెలివరీ, సెక్యూరిటీ రంగాలను కలిపి చూస్తే సంఖ్య పెద్దదే. వీరిలో చాలామందికి కంపెనీ క్యాబ్‌లు, ప్రైవేట్‌ క్యాబ్‌లు, ఆటోలు, సొంత వాహనాలే ప్రధాన రవాణా మార్గాలుగా ఉన్నాయి.

ఇక మెట్రో వేళలు కూడా నైట్‌ షిఫ్ట్‌ ఉద్యోగులకు కీలకం. హైదరాబాద్‌ మెట్రోలో రెడ్‌, బ్లూ లైన్ల టెర్మినల్‌ స్టేషన్ల నుంచి చివరి రైళ్లు రాత్రి 11 గంటలకు బయలుదేరుతాయి. గ్రీన్‌ లైన్‌ మాత్రం రాత్రి 11.35 వరకు సేవలు అందిస్తుంది. అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత షిఫ్ట్‌ ముగించే ఉద్యోగులకు మెట్రో ఉపయోగం చాలా పరిమితమే. షాపులు, మాల్స్‌, రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర కమర్షియల్‌ సంస్థల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. సాధారణ షాపులు, మాల్స్‌ రాత్రి 9–10 గంటల మధ్య మూసేసినా.. క్లోజింగ్‌, క్యాష్‌ సెటిల్‌మెంట్‌, స్టాక్‌, క్లీనింగ్‌, సెక్యూరిటీ వంటి పనులతో ఉద్యోగులు ఆ తర్వాతే బయటకు వస్తారు. రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్‌ డెలివరీ వంటి రంగాల్లో పని మరింత ఆలస్యంగా కొనసాగుతుంది.

అంటే షాపు మూసే సమయం ఉద్యోగి ఇంటికి చేరే సమయం కాదు. ఇక్కడే నైట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అవసరం కనిపిస్తోంది. ఒక ఉద్యోగి రాత్రి 1 గంటకు ఆఫీస్‌ నుంచి బయటకు వచ్చాడనుకుందాం. ఆఫీస్‌ నుంచి బస్‌స్టాప్‌ వరకు వెళ్లాలి. బస్సులో ప్రయాణించాలి. బస్సు దిగిన తర్వాత మళ్లీ ఇంటికి వెళ్లాలి. ఈ మూడు దశల్లో ఎక్కడ భద్రత లేకపోయినా మొత్తం ప్రయాణం ఇబ్బందే.

పోలీసులు ఎక్కడ?

హైదరాబాద్‌ నగర పోలీసింగ్‌లో రాత్రి పట్రోలింగ్‌, బీట్‌ సిబ్బంది, మొబైల్‌ పెట్రోలింగ్‌ వాహనాలు, SHE Teams, ట్రాఫిక్‌ పోలీసింగ్‌ వంటి వ్యవస్థలు పనిచేస్తాయి. కానీ నైట్‌ షిఫ్ట్‌లో ఖచ్చితంగా ఎంతమంది పోలీసులు విధుల్లో ఉంటారు అన్న సంఖ్యను నగరవ్యాప్తంగా పోలీస్‌ శాఖ పబ్లిక్‌ డేటాగా అందుబాటులో లేదు.

నగరంలో నేరాలు కూడా రాత్రి భద్రతపై ప్రశ్నలు లేవనెత్తే అంశమే. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ 2025 వార్షిక నివేదిక ప్రకారం నగరంలో మొత్తం నేరాలపై గణాంకాలు నమోదయ్యాయి.. అదే సమయంలో 2025లో మొత్తం క్రైమ్‌ రేట్‌ తగ్గిందని పోలీస్‌ శాఖ తెలిపింది.

హైదరాబాద్‌ మాత్రమే కాదు.. విస్తృత హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ప్రాంతంలో రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 2025లో 30,040 కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున సుమారు 82 కేసులు. ఇది హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధి మాత్రమే కాదు.. రాచకొండ కమిషనరేట్‌ పరిధి గణాంకాలు కలపాలి. దీన్ని నగరం మొత్తం రోజువారీ నేరాల సంఖ్యగా చూపకూడదు.

నేరాలు ఎక్కడ ఎక్కువగా జరుగుతున్నాయి? రాత్రి ఏ సమయాల్లో ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి? మహిళలపై నేరాలు ఎక్కడ జరుగుతున్నాయి? బస్‌స్టాప్‌లు, మెట్రో స్టేషన్లు, ఐటీ కారిడార్ల చుట్టూ పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు ఫిర్యాదు వచ్చిన తర్వాత ఎంత వేగంగా స్పందిస్తున్నారనేది కీలకం. ఇవి తెలుసుకుంటేనే హైదరాబాద్‌ నైట్‌ సేఫ్టీపై నిజమైన చిత్రం బయటపడుతుంది.

ముఖ్యంగా మహిళా ఉద్యోగుల విషయంలో కంపెనీ క్యాబ్‌ సేఫ్టీ, డ్రైవర్‌ వెరిఫికేషన్‌, GPS, ఎమర్జెన్సీ కాంటాక్ట్‌, సేఫ్‌ డ్రాప్‌ వంటి అంశాలు కీలకం. రాత్రి ఒంటరిగా ప్రయాణించే మహిళను చివరగా డ్రాప్‌ చేస్తున్నారా? డ్రైవర్‌ వివరాలు కంపెనీ వద్ద ఉన్నాయా? వాహనం ట్రాక్‌ అవుతోందా? అత్యవసర సమయంలో వెంటనే స్పందించే వ్యవస్థ ఉందా? ఇవన్నీ చూడాలి.

ఆర్టీసీ నైట్‌ బస్సుల్లోనూ GPS, CCTV, డ్రైవర్‌ శిక్షణ, ఎమర్జెన్సీ స్పందన వంటి భద్రతా చర్యలు ఉండాలి. అంతకంటే ముఖ్యంగా బస్సు ఆగే ప్రాంతాల్లో లైటింగ్‌, సీసీ కెమెరాలు, పోలీస్‌ పట్రోలింగ్‌ ఉండాలి. ఎందుకంటే బస్సు సేఫ్‌గా ఉండి.. బస్‌స్టాప్‌ సేఫ్‌గా లేకపోతే ప్రయోజనం లేదు.

లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీ మరో పెద్ద సమస్య

రాత్రి రెండు గంటలకు బస్సు దిగి.. ఇంటికి రెండు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తే? అక్కడి నుంచి ఆటో దొరుకుతుందా? క్యాబ్‌ వస్తుందా? రోడ్డు మీద లైటింగ్‌ ఉందా? పోలీస్‌ పట్రోలింగ్‌ ఉందా? ఇవన్నీ కూడా నైట్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో భాగమే. ఉద్యోగులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారిక కంపెనీ క్యాబ్‌ లేదా నమ్మకమైన పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించడం మంచిది. క్యాబ్‌లో ప్రయాణిస్తే వాహనం నంబర్‌, డ్రైవర్‌ వివరాలను కుటుంబ సభ్యులకు షేర్‌ చేయాలి. లైవ్‌ లొకేషన్‌ షేర్‌ చేయొచ్చు. రాత్రి బస్‌ కోసం వేచి ఉండాల్సి వస్తే లైటింగ్‌, జనసంచారం ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అత్యవసర నంబర్లు, కంపెనీ సెక్యూరిటీ కాంటాక్ట్‌లు ఫోన్‌లో సిద్ధంగా ఉంచుకోవాలి.

అయితే బాధ్యత మొత్తం ఉద్యోగిపైనే వేయడం సరికాదు.

ఏం చేయాలి…

కంపెనీకి ఒక బాధ్యత. ఆర్టీసీకి ఒక బాధ్యత. మెట్రోకు ఒక బాధ్యత. పోలీసులకు, స్థానిక సంస్థలకు మరో బాధ్యత ఉంది. హైదరాబాద్‌ నైట్‌ ఎకానమీ పెరుగుతున్నప్పుడు నైట్‌ ట్రాన్స్‌పోర్ట్‌, స్ట్రీట్‌ లైటింగ్‌, సీసీ కెమెరాలు, పోలీస్‌ పట్రోలింగ్‌, సేఫ్‌ బస్‌స్టాప్‌లు కూడా అదే స్థాయిలో పెరగాలి.

హైదరాబాద్‌ రాత్రి పనిచేస్తోంది. వేలాది మంది ఉద్యోగులు నగర ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నారు. వాళ్లు రాత్రి పని చేయడం మాత్రమే కాదు. సురక్షితంగా ఇంటికి చేరడం కూడా అంతే ముఖ్యం.

నైట్‌ బస్సులు రావడం మంచి అడుగు. కానీ అసలు విజయం ఉద్యోగి ఆఫీస్‌ గేటు నుంచి ఇంటి గుమ్మం వరకు సురక్షితంగా చేరినప్పుడే.

-కొండవీటి శివనాగరాజు, డిప్యూటీ అవుట్‌పుట్ ఎడిటర్, టీవీ9.

Follow Us