Hyderabad Rains: జల బీభత్సం.. బైక్‌తో పాటు వరదలో కొట్టుకుపోయిన యువకుడు.. ఆ తర్వాత

|

Oct 13, 2022 | 8:22 AM

రాత్రి కురిసిన వర్షంతో వాహనదారులు ముప్పుతిప్పలు పడ్డారు. రోడ్లపై ఎక్కడికక్కడ వరద నిలిచిపోయింది. వరదతో ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది.

Hyderabad Rains: జల బీభత్సం.. బైక్‌తో పాటు వరదలో కొట్టుకుపోయిన యువకుడు.. ఆ తర్వాత
Hyderabad Rains
Follow us on

నగరం జలమయమైంది. జల విలయం విరుచుకుపడింది. కుంభవృష్టి నగరాన్ని నట్టేట ముంచింది. వరుణుడి దండయాత్ర కంటిన్యూ అవుతోంది. నాన్‌స్టాప్‌ రెయిన్‌ సిటీ వాసుల్ని చిగురుటాకులా వణికిస్తోంది.  గ్రేటర్ హైదరాబాద్‌లో రాత్రి వర్షం దంచి కొట్టింది. నగరంలో మబ్బులు విరిగిపడ్డాయా? లేదంటే ఉన్న పళంగా వరుణుడు దండెత్తాడా అనే రేంజ్‌లో.. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో వాన బీభత్సం సృష్టించింది. నగరంలోని అన్ని ప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తింది. బాలానగర్‌లో అత్యధికంగా 10.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత తిరుమలగిరిలో 9.55 సెం.మీ.. బొల్లారంలో 9.43 సెం.మీ.. వెస్ట్ మారేడుపల్లి 9.33 సెం.మీ.. కుత్బుల్లాపూర్ 9.20 సెం.మీ.. ఆర్సీపురం 9.08 సెం.మీ.. భగత్ సింగ్ నగర్ 8.85 సెం.మీ వర్షపాతం కురిసింది. సికింద్రాబాద్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, అమీర్‌పేట్‌, బోరబండ, కూకట్‌పల్లి, నిజాంపేట్‌, నాంపల్లి, లక్డీకపూల్‌ ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి.

రోడ్లపైకి భారీగా వరద చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌ కింద భారీగా వరద నీరు చేరడంతో ఇరువైపులా కిలో మీటర్‌ మేర వాహనాలు ఆగిపోయాయి. బోరబండలో అపార్ట్‌మెంట్‌ సెల్లార్లలోకి వరద నీరు చేరింది. బోరబండలో వరద ప్రవాహంలో ఆటోలు, బైక్‌లు కొట్టుకుపోయాయి. ఇళ్లముందు పార్క్‌ చేసిన వాహనాలు కూడా వరదలో కొట్టుకుపోయాయి. రహమత్ నగర్, బోరబండలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రసూల్‌పురాలోనూ ఇళ్లలోకి నీరు చేరింది. బోరబండలో ఒక వ్యక్తి తన ద్విచక్ర వాహనంతో సహా వర్షపు వరద నీటిలో కొట్టుకుపోయాడు. స్థానికులు అతడిని కాపాడారు. ఆ వీడియో వైరల్‌గా మారింది.

వీడియో చూడండి

భారీ వర్షాలకు మహబూబ్‌నగర్‌ జలమయం అయింది. మోకాళ్ల లోతు నీళ్లలో జనం అవస్థలు పడుతున్నారు. కాలనీలన్నీ వరద నీటితో కకావికలమయ్యాయి. మహబూబ్‌నగర్‌ బీకే రెడ్డి కాలనీ, రామయ్యబౌలి ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి మోకాళ్ల లోతు నీళ్లు చేరడంతో.. ముంపు బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మహబూబ్‌నగర్‌లో వరద నీటిలో ఓ కుటుంబం తీవ్ర అవస్థలు పడింది. ఒక పెద్దావిడ, చిన్న పాపతో ఓ కుటుంబం నడుముల్లోతు నీళ్లలో వెళ్లేందుకు ప్రయత్నించింది. వరద ప్రవాహంలోకి వెళ్లగానే ముందుకు కదల్లేక, వెనక్కి రాలేక అల్లాడిపోయారు. స్థానికులు వెంటనే స్పందించి.. వారిని తమ ఇళ్లలోకి ఆహ్వానించడంతో ప్రమాదం తప్పింది.

దేశవ్యాప్తంగా వర్షాలు

తెలుగు రాష్ట్రాలే కాదు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌తో సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో వర్షం విధ్వంసం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్నో, అలీఘర్, మీరట్, గౌతమ్ బుద్ధ్ నగర్, ఘజియాబాద్‌తో సహా పలు జిల్లాల్లో పాఠశాలలు మూసివేయబడ్డాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం