
లిఫ్టుకు – గోడకు మధ్య ఇరుక్కుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని హైడ్రా ఆదివారం కాపాడింది. మూసాపేట, ఆంజనేయనగర్‌లోని 3 అంతస్తుల భవనంలో గ్రిల్స్‌తో కూడిన పాత లిఫ్ట్ ఈ దుర్ఘటనకు కారణమైంది. సెన్సార్లు సరిగా పని చేయకపోవడంతో రెండో అంతస్తులో దిగాల్సిన వ్యక్తి.. బయటకు వచ్చేలోపే లిఫ్ట్ పైకి వెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది. హైడ్రా కంట్రోల్ రూమ్‌కు ఉదయం 9.15 గంటలకు ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందింది . వెనువెంటనే ఉదయం 9.30 గంటలకే హైడ్రా మార్షల్ జేడీవీ ప్రసాద్ నేతృత్వంలోని బృందం అక్కడకు చేరుకుంది. మూడవ అంతస్తుకు – రెండో అంతస్తుకు మధ్య గ్రిల్స్‌లో కాలు ఇరుక్కొని వేళాడుతున్న మురళి(40)ని దాదాపు గంటన్నర పాటు కష్టపడి బయటకు తీశారు. లిఫ్ట్ గోడను బద్దలు కొట్టి తీయాల్సి వచ్చిందని జేడీవీ ప్రసాద్ తెలిపారు. సనత్‌నగర్ ఫైర్ సిబ్బందికి కూడా సమాచారం అందజేయడంతో వారి వద్ద ఉన్న హైడ్రాలిక్ కట్టర్ ద్వారా ఈ ఆపరేషన్‌ను పూర్తి చేశామని తెలిపారు.
సతీమణితో కలిసి మురళి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి రెండో అంతస్తుకు లిఫ్ట్ ఎక్కాడు. రెండో అంతస్తు చేరగానే మురళి బయటకు వెళ్లడానికి ప్రయత్నించాడు. ఇంతలోనే 3వ అంతస్తులో లిఫ్ట్ బటన్ వేరే వాళ్లు ప్రెస్ చేయగా.. క్షణాళ్లో పైకి వెళ్లిపోయింది. మురళి కాలు ఒకటి లిఫ్ట్‌లో – మరొకటి రెండో అంతస్తులో ఉండగా లిఫ్ట్ పైకి వెళ్లింది. లిఫ్ట్ గ్రిల్స్‌లో కాలు ఇరుక్కుంది. అప్పటికే లిఫ్ట్‌లో ఉన్న ఆయన సతీమణి కేకలు వేయగా అపార్టుమెంటులో నివసిస్తున్న వారు కాపాడేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో హైడ్రా కంట్రోల్ రూమ్‌కు ఫోను చేసి విషయాన్ని చెప్పారు. ఆ దగ్గర్లోని కూకట్‌పల్లిలో ఉన్న హైడ్రా డీఆర్ ఎఫ్ బృందం అక్కడకు చేరుకుని ఆపరేషన్‌ను ప్రారంభించింది. సరిగ్గా 10.50 గంటలకు బయటకు తీసి దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. మురళి కాలు లిఫ్ట్‌కు – గోడకు మధ్యలో నలిగిపోవడంతో ఫ్యాక్చర్ అయ్యింది. సమాచారం అందగానే వచ్చి లిఫ్ట్‌లో ఇరుక్కుని వేలాడుతున్న మురళిని కింద నుంచి పట్టుకుని సురక్షితంగా బయటకు తీయడం పట్ల స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సనత్‌నగర్ ఫైర్ స్టేషన్ సిబ్బందితో పాటు హైడ్రా డీఆర్ ఎఫ్ సభ్యులు మార్షల్ జేడీవీ ప్రసాద్, ఎర్రసాని అనిల్‌కుమార్, జమ్మ రమేష్, వీత రమేష్, పల్లికామిటి గోపి, పోలీసు కానిస్టేబుల్ నరేష్ ఈ ఆపరేషన్లో భాగస్వామ్యులయ్యారు.