Hyderabad: గుడ్‌న్యూస్ అంటే ఇదే.. హైదరాబాద్‌లో రూ.26 లక్షలకే ఫ్లాట్.. ఈ ఆఫర్ కొన్ని రోజులే..

గచ్చిబౌలిలోని AIG హాస్పిటల్ చుట్టుపక్కల, రామ్కీ టవర్స్, రామ్కీ CEO క్వార్టర్స్, వసంత ప్రాజెక్ట్స్ ఉన్న పరిసరాల్లో.. ఇప్పటికే నిర్మాణం పూర్తైన ఫ్లాట్స్‌ను లోయర్ ఇన్‌కమ్ గ్రూప్ ప్రజల కోసం విక్రయానికి ఉంచింది. తెలంగాణ హౌసింగ్ బోర్డు. కొత్తగా నిర్మించబోయే ఇళ్లు కాదు ఇవి. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు.

Hyderabad: గుడ్‌న్యూస్ అంటే ఇదే.. హైదరాబాద్‌లో రూ.26 లక్షలకే ఫ్లాట్.. ఈ ఆఫర్ కొన్ని రోజులే..
Flats In Hyderabad

Edited By:

Updated on: Dec 28, 2025 | 6:37 PM

హైదరాబాద్‌లో ఇల్లు కొనడం అనేది ఇప్పుడు అవసరం కాదు.. ఆశ.. ప్రత్యేకంగా గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో ఆ ఆశను చాలామంది మనసులోనే దాచుకుంటున్నారు. ఫ్లాట్ ధరలు కోట్లలో తిరుగుతున్న వేళ, అక్కడే రూ.26 లక్షల మాట వినిపించగానే అందరి చూపు ఒక్కసారిగా అక్కడికి మళ్లింది. గచ్చిబౌలిలోని AIG హాస్పిటల్ చుట్టుపక్కల, రామ్కీ టవర్స్, రామ్కీ CEO క్వార్టర్స్, వసంత ప్రాజెక్ట్స్ ఉన్న పరిసరాల్లో.. ఇప్పటికే నిర్మాణం పూర్తైన ఫ్లాట్స్‌ను లోయర్ ఇన్‌కమ్ గ్రూప్ ప్రజల కోసం విక్రయానికి ఉంచింది. తెలంగాణ హౌసింగ్ బోర్డు. కొత్తగా నిర్మించబోయే ఇళ్లు కాదు ఇవి. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు. ఈ ప్రాంతంలో మొత్తం 111 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. పరిమాణం పెద్దగా కాకపోయినా, లొకేషన్ మాత్రం పెద్దదే. 479 నుంచి 636 చదరపు అడుగుల మధ్య ఉన్న ఈ ఫ్లాట్స్‌కు ధరలు రూ.26.40 లక్షల నుంచి రూ.36.20 లక్షల వరకు నిర్ణయించారు. ఐటీ ఆఫీసులు, హాస్పిటల్స్, కాలేజీల మధ్య ఉండే ఈ ప్రాంతంలో ఇలాంటి ధరలు కనిపించడం చాలా అరుదు. అందుకే ఈ ప్రకటన వెలువడిన వెంటనే చర్చ మొదలైంది.

ఈ అవకాశం అందరికీ కాదు. లోయర్ ఇన్‌కమ్ గ్రూప్‌కు చెందినవారికే. నెలకు రూ.50 వేల లోపు ఆదాయం ఉండాలి. లాటరీలో ఫ్లాట్ వస్తే.. అప్పుడే ఆదాయ ధృవీకరణ పత్రం చూపించాలి. మధ్యలో మాటలు, మార్గాలు లేవు. లాటరీ ద్వారానే కేటాయింపు. పారదర్శకతే లక్ష్యమని హౌసింగ్ బోర్డు చెబుతోంది. దరఖాస్తు చేసుకోవాలంటే రూ.1 లక్ష టోకెన్ అడ్వాన్స్ చెల్లించాలి. మీ–సేవ కేంద్రం ద్వారా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. జనవరి 3, 2026 వరకు దరఖాస్తులకు గడువు ఉంది. గచ్చిబౌలి ఫ్లాట్స్‌కు లాటరీ డ్రాను జనవరి 6న నిర్మిత్ కేంద్రంలో నిర్వహించనున్నారు.

ఈ ప్రక్రియ గచ్చిబౌలితోనే ఆగిపోలేదు. వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ ఇదే తరహాలో లోయర్ ఇన్‌కమ్ గ్రూప్ ఫ్లాట్స్‌ను హౌసింగ్ బోర్డు ముందుకు తీసుకొచ్చింది. వరంగల్‌లో రైల్వే స్టేషన్‌కు సమీపంగా ఉన్న కాలనీలో 102 ఫ్లాట్స్‌ను, ఖమ్మంలో శ్రీరామ్ హిల్స్, బోనకల్ రోడ్ ప్రాంతంలో 126 ఫ్లాట్స్‌ను విక్రయానికి ఉంచారు. అక్కడ ధరలు మరింత తక్కువ. వరంగల్‌లో జనవరి 8న, ఖమ్మంలో జనవరి 10న లాటరీ నిర్వహించనున్నారు.

ఇళ్ల ధరలు పెరుగుతున్న కాలంలో, సొంతింటి కల నెమ్మదిగా దూరమవుతున్న వేళ.. గచ్చిబౌలిలో రూ.26 లక్షల మాట చాలా మందికి కొత్త ఆశలా వినిపిస్తోంది. నగరంలో ఇల్లు అనేది తమకు సాధ్యం కాదనుకున్నవారికి ఇది ఒక్కసారిగా తెరుచుకున్న తలుపు. అందుకే ఇది సాధారణ నోటిఫికేషన్ కాదు.. చాలామందికి జీవితంలో అరుదుగా దొరికే అవకాశం. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసే సమయంలో రూ.1,00,000ను ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ లేదా టోకెన్ అడ్వాన్స్‌గా చెల్లించాలి. ఈ మొత్తాన్ని తప్పనిసరిగా మీ–సేవ కేంద్రం ద్వారా చెల్లించి దరఖాస్తు పూర్తి చేయాలి. లక్కీ డ్రాలో ఫ్లాట్ రాని అభ్యర్థులకు వారు చెల్లించిన ఈ ఎర్నెస్ట్ మనీ డిపాజిట్‌ను అదే చెల్లింపు మార్గం ద్వారా తిరిగి చెల్లిస్తామని హౌసింగ్ బోర్డు స్పష్టం చేసింది. లాటరీలో ఫ్లాట్ కేటాయించిన అభ్యర్థులు నిర్ణీత గడువుల్లో విడతల వారీగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఫ్లాట్ కేటాయింపు సమాచారం అందిన తేదీ నుంచి 15 రోజుల్లోపు మొత్తం ఫ్లాట్ ధరలో 25 శాతం చెల్లించాలి.

ఈ మొత్తం చెల్లించిన అనంతరం ‘అలోట్మెంట్ కమ్ కన్ఫర్మేషన్’ లేఖను హౌసింగ్ బోర్డు జారీ చేస్తుంది. మొదటి విడత చెల్లింపు పూర్తయిన తరువాత, అలోట్మెంట్ తేదీ నుంచి 60 రోజుల్లోపు మొత్తం ఫ్లాట్ ధరలో మరో 50 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరువాత చివరి విడతగా మిగిలిన 25 శాతం మొత్తాన్ని అలోట్మెంట్ తేదీ నుంచి 90 రోజుల్లోపు చెల్లించాలి. ఈ విధంగా మూడు విడతల్లో చెల్లింపులు పూర్తి చేసిన తరువాత ఫ్లాట్ మీ పేరుతో రిజిస్టర్ అవుతుందని అధికారులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..