Hyderabad: ‘భాయ్‌ బచ్చా ఆగయా’.. నా సామిరంగా డీకోడ్‌ చేస్తే 86 మంది దొరికారు.. ఎవర్రా మీరంతా..

అసలు ఎవర్రా మీరంతా...! ఏంట్రా ఇదంతా...! ఎక్కడ్నుంచి వచ్చార్రా...! ఆ కోడ్‌ లాంగ్వేజ్‌లు ఏంటి...! మీరు చేస్తున్న పనులేంటి...! మొన్నేమో 'బచ్చా ఆగయా' అన్నారు. ఇప్పుడేమో 'భాయ్‌ బచ్చా ఆగయా' అంటున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు మొదలుకొని విద్యార్థుల వరకూ మత్తుకు బానిసలను చేసేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈగల్లా తిరుగుతూ... ఈగల్‌ టీమ్‌నే ఇరిటేట్‌ చేస్తున్నారు కంత్రీగాళ్లు..

Hyderabad: ‘భాయ్‌ బచ్చా ఆగయా’.. నా సామిరంగా డీకోడ్‌ చేస్తే 86 మంది దొరికారు.. ఎవర్రా మీరంతా..
Ganja Bust

Updated on: Jul 19, 2025 | 8:23 AM

మత్తుగాళ్ల తుక్కురేగ్గొడతాం..! గ్రాము దొరికినా గుండు పగలగొడతాం..! డ్రగ్స్‌ సప్లై చేశారో చచ్చారే అంటూ యమా దూకుడు మీదున్న ఈగల్‌ టీమ్‌… రీసెంట్‌గా ఆపరేషన్‌ డెకాయ్‌ని షురూ చేసింది. అందులోభాగంగానే డ్రగ్స్‌ పెడ్లర్లను మాటువేసి పట్టుకుంటోంది. మత్తుకు బానిసై డ్రగ్స్‌ కొంటున్న వాళ్లనూ వదిలేదే లేదంటోంది. ఇక మొన్నటికి మొన్న సందీప్‌ అనే వ్యక్తిని పట్టుకున్న అధికారులు.. అతని ఫోన్‌ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసి ‘బచ్చా ఆగయా’ కోడ్‌ను డీకోడ్‌ చేశారు. ఆ మేసేజ్‌ వెళ్లిన రెండు గంటల్లోనే డ్రగ్స్‌ కోసం వచ్చిన 14 మందిని అరెస్ట్‌ చేశారు. ఈ కోడ్‌ లాంగ్వేజ్‌ వెనుక పెద్ద నెట్‌వర్క్‌ ఉందన్న అనుమానంతో ఇన్వెస్టిగేషన్‌ను స్పీడప్‌ చేసి.. మరో కోడ్‌ను డీకోడ్‌ చేసి ఓ బిగ్‌ బ్యాచ్‌ గుట్టురట్టు చేశారు.

మొన్న ‘బచ్చా ఆగయా’ అయితే ఇవాళ ‘భాయ్‌ బచ్చా ఆగయా’. యస్‌.. భాయ్ బచ్చా ఆగయా కోడ్‌ను డీకోడ్‌ చేసిన అధికారులు.. మరో 86 మందిని అరెస్ట్‌ చేశారు. వీరిలో ఎక్కువ మంది ఐటి ఉద్యోగులు ఉండగా పలువురు రిలేషన్‌షిప్ మేనేజర్లు, ఇంకొంతమంది ఆన్‌లైన్ ట్రేడర్లతో పాటు విద్యార్థులు కూడా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు కుటుంబ సభ్యులతో కలిసి డ్రగ్స్‌ తీసుకోవడానికి రావడం చూసి అధికారులే షాక్‌ అవుతున్నారు. దాదాపు 100 ప్యాకెట్లకు పైగా విక్రయం జరిగిందని.. ఒక్కో ప్యాకెట్‌కు 3వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు..

రాజస్థాన్‌ నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి అమ్ముతున్నట్లు తేల్చారు ఈగల్ టీమ్‌ అధికారులు. 45 రోజులపాటు నిఘా ఉంచి ఇప్పటివరకు ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పట్టుకున్నారు. అంతేకాదు డ్రగ్స్‌ తెలంగాణలోకి ఎంటర్‌కాకుండా చెక్‌పోస్టుల్లోనూ నిఘా పెంచారు. అలాగే అరెస్టైన 86 మందిని డీ అడిక్షన్‌ సెంటర్‌కు పంపారు. మరిన్ని ఆధారాల కోసం వారందరి ఫోన్లలో ఉన్న సమాచారాన్ని సేకరిస్తున్నారు.

మొత్తంగా… ప్రభుత్వ ఆదేశాలతో డ్రగ్స్‌పై సీరియస్‌ డ్రైవ్‌ చేస్తున్నారు అధికారులు. ఈ డెకాయ్‌ ఆపరేషన్‌ కంటిన్యూ అవుతుందంటున్నారు. ఫ్యామిలీని సైతం తీసుకుని డ్రగ్స్‌ కోసం వస్తుండటం చూసి ఇంకాస్త దూకుడు ముందుకెళ్తామంటున్నారు. సో మత్తుబాబులు ఇకనైనా మారాల్సిందే..! పెడ్లర్లు రాష్ట్రం వదిలి పారిపోవాల్సిందే..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..