206 Kidney stones remove in one hour: హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ఘనత సాధించింది. వైద్యులు ఓ రోగి కిడ్నీ నుంచి గంటలో 206 రాళ్లను తొలగించారు. ఈ ఘటన అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. కిడ్నీలో రాళ్ల కారణంగా ఆరు నెలల నుంచి ఎడమవైపు తీవ్రమైన నొప్పితో రోగి బాధపడుతుండగా.. అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు కీహోల్ శస్త్రచికిత్స ద్వారా కేవలం ఒక గంటలో రోగి కిడ్నీ నుంచి 206 రాళ్లను తొలగించినట్లు యాజమాన్యం తెలిపింది. ఆసుపత్రి వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండకు చెందిన వీరమల్ల రామలక్ష్మయ్య అనే 56 ఏళ్ల వ్యక్తి.. కిడ్నీలో తీవ్రమైన నొప్పితో ఏప్రిల్ 22న అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రిలోని వైద్యులను సంప్రదించాడు. అతన్ని వైద్యులు పరిశీలించారు. అయితే.. ముందు స్థానిక ఆర్ఎంపీ వైద్యుడికి చూపించి, అతడు సూచించిన కొన్ని మందులను రోగి వాడుతున్నాడు. ఇది స్వల్పకాలిక ఉపశమనాన్ని మాత్రమే అందించినట్లు వైద్యులు తెలిపారు. ఎండాకాలం కావడంతో.. నొప్పి తీవ్రత పెరగడంతో ఇక్కడ సంప్రదించినట్లు తెలిపారు.
అతన్ని సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ పూల నవీన్ కుమార్ క్షుణ్ణంగా పరిశీలించి ప్రాథమిక పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేశారు. అయితే.. అతని ఎడమ మూత్రపిండంలో చాలా రాళ్లు ఉన్నట్లు తేలింది. తర్వాత సీటీ కబ్ స్కాన్ చేసి దీన్ని మరోసారి ధ్రువీకరించుకొని.. గంటపాటు కీహోల్ శస్త్రచికిత్స చేశామని నవీన్ కుమార్ తెలిపారు. ఈ సమయంలో మొత్తం 206 రాళ్లను మూత్రపిండం నుంచి తొలగించినట్లు తెలిపారు. కీహోల్ శస్త్రచికిత్స అనంతరం రోగి కోలుకున్నాడని.. రెండోరోజే అతన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు.
కాగా.. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండటంతో చాలా మంది డీహైడ్రేషన్‌కు గురవుతున్నారని వైద్యులు తెలిపారు. దీంతో మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడతాయతీ.. అందుకే వీలైనంత ఎక్కువగా నీళ్లు, కొబ్బరి నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండలో ప్రయాణాలను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలని.. శీతల పానీయాలు కూడా తాగవద్దని సూచిస్తున్నారు.