Hyderabad MMTS Trains Start: భాగ్యనగరంలో ప్రజా రవాణ పట్టాలపైకి వస్తోంది. ఏడాదిన్నర క్రితం ఆగిపోయిన సర్వీసులు రీస్టార్ట్ అవుతున్నాయి. వచ్చే వారం నుంచే ఎంఎంటీఎస్ పరుగులు పెట్టనుంది.
హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైలు సేవలు వచ్చే వారం నుంచి మొదలుకానున్నాయి. ఈ మేరకు రైల్వే మంత్రిత్వశాఖ నిర్ణయించినట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. లాక్‌డౌన్‌తో ఆగిపోయిన ఎంఎంటీఎస్ రైళ్లు ఏడాదిన్నర గడిచినా పట్టాలెక్కలేదు. ఈ కారణంగా చిన్న వ్యాపారులు, ఉద్యోగులు, కూలీలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
ముఖ్యంగా 5,10 రూపాయలకే దర్జాగా ప్రయాణించేవారు.. ఇప్పుడు రోజుకు దాదాపు 100 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు. అలాంటి వారికి వీలైనంత త్వరగా ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులోకి తీసుకొచ్చి రవాణా ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేస్తామంటోంది రైల్వే శాఖ. ఎంఎంటీఎస్ రైళ్లు రీస్టార్ట్‌తో దిగువ మధ్య తరగతి ప్రజలు, చిరు వ్యాపారులు, విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగులకు అత్యంత చవకైన, సురక్షితమైన రవాణా సదుపాయం కలుగుతుందని కిషన్‌రెడ్డి తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తాయన్నారు. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ సేవలు రీస్టార్ట్ చేస్తే ప్రజలు కరోనా రూల్స్ కచ్చితంగా పాటిస్తూ ప్రయాణం చేయాలంటున్నారు మంత్రి కిషన్ రెడ్డి. థర్డ్ వేవ్ భయపెడుతున్నందున ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మళ్లీ డేంజర్‌లో పడతామని అన్నారు. తన రిక్వస్ట్‌ను మన్నించి ఎంఎంటీఎస్ సేవలు పునః ప్రారంభానికి అంగీకరించిన కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు హైదరాబాద్ ప్రజల తరఫున మంత్రి కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు నిన్నటి నుంచి అన్నీ సేవలు రీస్టార్ట్ అయ్యాయి. సిటీ బస్ సర్వీసులు, ప్రైవేటు రవాణా సర్వీస్‌లు, మెట్రో సేవలు కూడా ఎప్పటి మాదిరిగానే తిరుగుతున్నాయి. కానీ, మొదటి వేవ్‌లో ఆగిపోయిన ఎంఎంటీఎస్‌లు మాత్రం ఇప్పటి వరకు రీస్టార్ట్ కాలేదు. ఆ ఆలోచన వచ్చినప్పటికే రెండో వేవ్ కమ్మేసింది. ఇప్పుడు కేసులు తగ్గుముఖం పట్టినందున సర్వీస్‌లు ప్రారంభించడానికి రైల్వేశాఖ నిర్ణయించింది. వచ్చే వారం నుంచి ఎంఎంటీఎస్‌లు పట్టాలపై పరుగులు తీయనున్నాయి.
Read Also… Hyderabad Metro Train: హైదరాబాద్ మెట్రో రైలు సమయం పెంపు.. నేటి నుంచి రాత్రి 10గంటల వరకు పరుగులు