Hyderabad: హైదరాబాద్‌లో బుధవారం పాఠశాలలకు సెలవు..!

రాబోయే మూడు రోజులు హైదరాబాద్‌కు భారీ వర్షాల ముప్పు ఉంది. ఉత్తర హైదరాబాద్, మేడ్చల్, సైబరాబాద్ పరిధుల్లో 20 సెం.మీ. వరకు వర్షపాతం కురిసే అవకాశం ఉందని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు. అత్యవసర సహాయ నంబర్లు విడుదల చేశారు. బుధవారం పాఠశాలలకు సెలవు ప్రకటించాలని ప్రభుత్వానికి సూచించారు.

Hyderabad: హైదరాబాద్‌లో బుధవారం పాఠశాలలకు సెలవు..!
Students In Rain

Updated on: Aug 12, 2025 | 9:14 PM

రాబోయే మూడు రోజులు హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 13 ఆగస్టు (బుధవారం) నుంచి 15 ఆగస్టు (శుక్రవారం) వరకు అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైడ్రా కమిషనర్ ప్రకటన విడుదల చేశారు. ఉత్తర హైదరాబాద్, మేడ్చల్ జిల్లా, సైబరాబాద్ పరిధిలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాంతాల్లో 10–15 సెం.మీ. వర్షం కురిసే అవకాశం ఉండగా.. కొన్ని చోట్ల 20 సెం.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

వర్షం కురుస్తున్న సమయంలో అత్యవసరం కాకపోతే వాహనాలతో బయటకు రాకూడదని హైడ్రా సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తుగా సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచన చేసింది. ముంపు ప్రాంతాల్లో అనవసరంగా తిరగకూడదు. హైడ్రా, జీహెచ్‌ఎంసీ రెస్క్యూ బృందాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెప్పారు. అత్యవసర సహాయం కోసం.. 040 29560521, 9000113667, 9154170992 నంబర్లను సంప్రదించవచ్చు. ఇక బుధవారం నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో పాఠశాలలకు సెలవు ప్రకటించాలని.. హైడ్రా కమిషనర్ ప్రభుత్వానికి సూచించారు. అటు ఐటీ సంస్థలు సైతం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ చేసేలా సూచించాలని కోరారు.

 

సీఎం రేవంత్ కీలక ఆదేశాలు…

తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయన్న హెచ్చరికల నేపథ్యంలో…అప్రమత్తంగా ఉండాలని ఇన్‌చార్జి మంత్రులు, ఉన్నాతాధికారులు, కలెక్టర్లకు సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణకు లా అండ్ ఆర్డర్ పోలీసుల సేవలను కూడా వినియోగించుకోవాలన్నారు. అకస్మిక వరదలు సంభవించినపుడు ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు అవసరమైన హెలికాప్టర్స్ ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. NDRF సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని, విద్యుత్‌ సరఫరాకు సంబంధించి అత్యవసర సమయాల్లో ఉపయోగించుకునేందుకు వీలుగా మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్స్‌ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి. హైదరాబాద్‌లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా ఉండాలని, 24 గంటలు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. అత్యవసర సమయాల్లో ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలన్నారు.

స్కూల్స్, కాలేజీలు, ఐటీ ఉద్యోగులకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులు తగిన నిర్ణయం తీసుకోవాలని, భారీ వర్షాల సమయంలో ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు రాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.